Begin typing your search above and press return to search.

సామాన్యుడికి సలహాదారు పదవి..! చంద్రబాబు షాకింగ్ డెసిషన్

ప్రభుత్వ సలహాదారు.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది.. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:30 AM
సామాన్యుడికి సలహాదారు పదవి..! చంద్రబాబు షాకింగ్ డెసిషన్
X

ప్రభుత్వ సలహాదారు.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది.. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారులుగా ఎవరూ ఊహించని వ్యక్తులు ఎంపిక అవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఎంతో మంది సీనియర్ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తుంటే.. వారిని కాదని ఎవరి అంచనాలు లేని వ్యక్తులను సలహాదారులుగా తీసుకుంటూ తన రూటే సెపరేటు అనే సంకేతాలిస్తున్నారు సీఎం చంద్రబాబు.

ఏపీ అటవీశాఖ సలహాదారుగా ఫారెస్ట్ మ్యాన్, జర్నలిస్టు అంకారావును నియమించింది ఏపీ ప్రభుత్వం. రాజకీయాలకు సంబంధం లేని అంకారావుకు కూడా తనకు సలహాదారుగా నియమిస్తారని, సీఎం ప్రకటించేవరకు తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అంకారావు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో అడవుల పెంపకంలో ఆయన సేవలు అవసరమని గుర్తించి ఈ నియామకాన్ని చేపట్టిందని చెబుతున్నారు.

అంకారావు నియామకంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆసక్తి చూపారని అంటున్నారు. ఆయన సిఫార్సుతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద నాయకులకే ప్రభుత్వ సలహాదారు పదవి అన్న అపోహను చెరిపేస్తూ సామాన్యులకు పదవులు వరిస్తాయని ఈ అనూహ్య నిర్ణయంతో స్పష్టం చేసినట్లైంది.

గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించింది. ఇస్రో మాజీ ఛైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర ఫణిక్కర్ సోమ్‌నాథ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, డీఆర్‌డీఓ మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జీ సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీకి సలహాదారులుగా నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా కేపీసీ గాంధీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్- జీ సతీష్ రెడ్డి, స్పేస్ టెక్నాలజీ- ఎస్ సోమనాథ్, చేనేత, హస్త కళల అభివృద్ధి శాఖ సలహాదారుగా సుచిత్ర ఎల్లా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నారు. ఇక అటవీ విస్తీర్ణం పెంపు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న ఫారెస్ట్ మ్యాన్ అంకారావుకు సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది.