రెబెల్స్ ని కూటమి తలుపులు క్లోజ్... బాబు కఠిన నిర్ణయం
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నుంచి రెబెల్స్‌గా పోటీ చేసి పలువురు విజయం సాధించారు. జీవీఎంసీలో 9 మంది, పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో 10 మంది గెలిచారు. అయితే రెబెల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో వారిని తిరిగి పార్టీలోకి తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది.
By: Satya P | 10 Nov 2026 12:49 AM ISTస్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కక పోవడంతో కూటమిలోని మూడు పార్టీల నుంచి చాలా మంది రెబెల్స్ గా బరిలోకి దిగి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో బలమున్న వారు గెలిచి సత్తా చూపించారు. అలా జీవీఎంసీలో ఏకంగా 9 మంది రెబెల్స్ గెలిచారు. వీరంతా కూటమి టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించి బరిలోకి దిగిన వారే. అలాగే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఏకంగా 10 మంది రెబెల్స్ కౌన్సిలర్లుగా గెలిచారు. వీరే కాకుండా ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లోనూ పరిషత్తు ఎన్నికల్లోనూ కూటమి పార్టీల నుంచి చాలా మంది రెబెల్స్ గా దిగి విన్నర్స్ అయ్యారు.
భారీ షాక్ :
దీంతో రెబెల్స్ అంతా తమ సొంత పార్టీలలోకి తిరిగి వెళ్ళిపోవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దగా చంద్రబాబు భారీ షాక్ ఇచ్చేశారు. ఆయన ఎన్నికల ఫలితాల మీద మీడియాతో మాట్లాడుతూ రెబెల్స్ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతిభావంతులు ఎందరో ఉన్నారని అయితే సీట్లు దక్కకపోతే బరిలోకి దిగి రెబెల్స్ గా మారితే ఎలా అనంట్లుగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. కూటమి సర్దుబాట్ల కోసం త్యాగాలు చేసిన వారికే గుర్తింపు అన్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చేశారు అని అంటున్నారు.
భారీగానే రెబెల్స్ :
ఇక చూస్తే స్థానిక ఎన్నికల్లో భారీగానే ఈసారి రెబెల్స్ గెలిచారు అని అంటున్నారు. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసినప్పటికీ స్థానిక పొత్తులు అలాగే టికెట్ల కేటాయింపుల్లో సమన్వయ లోపం కారణంగా చాలా చోట్ల రెబెల్స్ బరిలోకి దిగి గెలిచారు. ఇలా రెబెల్స్ గా దిగిన వారు కేవలం వార్డులకే పరిమితం కాకుండా చాలా చోట్ల కీలక పదవులు అందుకున్నారు. అలా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ రెెబెల్ అభ్యర్థి లంక అప్పలనాయుడు, సాలూరులో మరో టీడీపీ రెబెల్ . అరుణ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పీఠాలనే దక్కించుకుని పార్టీలకు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన రెబెల్ అభ్యర్థి అధికారిక బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.
ఏం చేస్తారు :
నిజానికి రెబెల్స్ అంతా తమ సొంత పార్టీల పట్ల విధేయంగానే ఉన్నారు. తమకు టికెట్ దక్కలేదని అసంతృప్తితో పోటీకి దిగారు. తమ బలాన్ని విజయాన్ని చాటి చెబితే తిరిగి పార్టీలో చేరిపోవచ్చు అనుకున్నారు. గతంలో అలా చాలా సార్లు జరిగింది. ఈసారి కూడా అలాగే అనుకుంటే మాత్రం బాబు నిర్ణయం వారిని పూర్తిగా డైలామాలో పడేసింది. పార్టీ అండ లేకుండా ఇండిపెండెంట్లుగా వారు ఏమి సాధిస్తారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. అంతే కాదు వారు వెంట ఉన్న క్యాడర్ కూడా సొంత పార్టీ వైపు నిలబడితే మరింత ఒంటరి అవుతారు అని అంటున్నారు.
అందుకే కఠినం :
నిజానికి రెబెల్స్ విషయంలో టీడీపీ సింగిల్ గా అయితే ఒక డెసిషన్ తీసుకునేందుకు వీలు ఉంది. కానీ మూడు పార్టీలు ఉన్నాయి. రెబెల్స్ దిగడం వల్ల మిత్ర పక్షాలకు భారీ దెబ్బ తగిలింది. సాలూరులో జనసేనకు చైర్మన్ సీటు ఇస్తే అక్కడ రెబెల్ గెలిచారు. అలాగే బీజేపీకి నెల్లిమర్ల నగర పంచాయతీ ఇస్తే అక్కడ కాదని టీడీపీ రెబెల్ గెలిచారు. అంతే కాదు అనేక చోట్ల రెబెల్స్ వల్ల వైసీపీ విజయావకాశాలు పెరిగాయని కూడా ఉంది. దీంతోనే చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.
