ఏపీలో యూపీ మోడల్.. యోగి సర్కారును ఆదర్శంగా చంద్రబాబు కీలక నిర్ణయం?
దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తనకంటే ఎంతో జూనియర్ అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాలను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 11:01 AMదేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తనకంటే ఎంతో జూనియర్ అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాలను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పరిపాలనలో సంస్కరణలతో అడ్మినిస్ట్రేటరుగా చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనూ ఆయన పాలన విధానాలను చాలా మంది అభిమానిస్తారు. కానీ, ఆయన మాత్రం 8 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ ను పాలిస్తున్న బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ పాలనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారని అంటున్నారు. అన్ని విషయాలు కాకపోయినా, ప్రధానంగా శాంతిభద్రతల అదుపు, అరాచకశక్తుల అణచివేతలో యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలను ఏపీలోనూ అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జనసేన సర్కారు అధికారంలో ఉంది. దాదాపు 14 ఏళ్లు సీఎంగా, మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనట్లు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యూపీ సర్కారు ఫార్ములాను అనుసరించాలని చంద్రబాబు నిర్ణయించడమే చర్చనీయాంశమవుతోంది. యూపీలో యోగి సీఎం అవ్వకముందు మాఫియా ముఠాలు పెట్రేగిపోయేవి. దందాలు, దౌర్జన్యాలతో రౌడీమూకలు ప్రజలను నానా అవస్థలకు గురిచేసేవారు. దోపిడీలు, దొంగతనాలకు హద్దే ఉండేవి కాదన్న ప్రచారం కూడా ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఈ అరాచకశక్తులకు సింహస్వప్నమయ్యారు. నేరాలకు పాల్పడేవారిని నిర్థాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం, బుల్‌డోజరులతో వారి ఆస్తులు, ఇళ్లను నేలమట్టం చేయడం వంటి తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో యోగి రెండో సారి ముఖ్యమంత్రిగా గెలవడమే కాకుండా, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అరాచకశక్తులు తోకముడిచాయని అంటున్నారు. ప్రజలు కూడా తమకు భద్రంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పలు సర్వేలు నివేదిస్తున్నాయి.
అయితే యూపీతో పోల్చుకుంటే ఏపీలో శాంతిభద్రతల సమస్య అంతలా లేకపోయినా, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం, మహిళలు, పిల్లలను కించపరిచే పోస్టింగులతో చికాకు కలిగిస్తున్నవారిని అదుపు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. అన్ని పార్టీల్లోనూ మహిళా నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు సోషల్ సైకోల బాధితులుగా ఉంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ తరహా నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నా అదుపులోకి రావడం లేదని అంటున్నారు. రౌడీ షీట్ తెరుస్తామని బెదిరిస్తున్నా ఆడబిడ్డలపై దాడులు ఆగడం లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు అనుసరిస్తున్న విధంగానే ఏపీలోనూ కొన్ని కఠిన నిర్ణయాలు అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాకపోతే, బుల్‌డోజర్ లతో ఆస్తుల కూల్చివేత, ఎన్ కౌంటర్ చేయించడం వంటి పద్ధతులకు దూరంగా నేర మనస్తత్వం ఉన్నవారిని అదుపులోకి తేవాలని భావిస్తున్నారు. నేరాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి సంక్షేమ పథకాలు నిలిపివేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ నిబంధన అమలులోకి తెస్తే విపక్షం వైసీపీ చేసే సోషల్ మీడియా ప్రచారానికి అడ్డుకట్ట వేయవచ్చని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’ అన్న పోస్టర్లు దర్శనమివ్వడంతో రాజకీయ ముసుగులో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలిచ్చినట్లు అవుతుందని అంటున్నారు. పథకాలు నిలిచిపోతాయంటే కుటుంబ సభ్యుల ఒత్తిడితో చాలా మందిలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా యోగి ఫార్ములాకు ఫిదా అయ్యారని బీజేపీ ప్రచారం చేస్తోంది.