Begin typing your search above and press return to search.

తిరుమల పూర్తిగా మారిపోతుందా..? ప్రసాదాలు, దర్శనాలపై కీలక మార్పులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల సన్నిధిలో ప్రసాదాల నాణ్యత, దర్శన సమయాల పర్యవేక్షణ విషయంలో కీలక అడుగు పడింది.

By:  Tupaki Political Desk   |   21 March 2026 4:21 PM IST
తిరుమల పూర్తిగా మారిపోతుందా..? ప్రసాదాలు, దర్శనాలపై కీలక మార్పులు
X

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల సన్నిధిలో ప్రసాదాల నాణ్యత, దర్శన సమయాల పర్యవేక్షణ విషయంలో కీలక అడుగు పడింది. ప్రసాదాల నాణ్యత పరీక్షించేందుకు అత్యాధునిక వాటర్ - ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అదేసమయంలో దర్శన సమయంలో జాప్యాన్ని నివారించేందుకు AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఏర్పాటు చేశారు. ఈ రెండింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తిరుమల అధికారులకు కీలక సూచనలు చేశారు.





తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడకం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తిరుమలలో ఆత్యాధునిక వాటర్-ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భక్తుల నమ్మకాన్ని కాపాడటమే కాకుండా నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలనే సంకల్పంతో తిరుమలలో ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ ను శనివారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబం తిరుమలకు వచ్చింది. ఈ సందర్భంగా ఫుడ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.





ఫుడ్ ల్యాబ్ ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా వాటిల్లకూడదని అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా... ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసిందని కొనియాడారు.





స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక వాటర్ - ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదేనని ప్రభుత్వం తెలిపింది. ల్యాబ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్ పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలుగా దీనిని నిర్మించారు. ఇందులో ఈ-టంగ్, ఈ-నోస్, వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవి ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించగలవని అధికారులు సీఎంకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగం, ఇప్పుడు నెలకు 1,000 నుంచి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

తిరుమలలో ల్యాబ్ దేశానికే ఆదర్శం

బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. శ్రీవారి ప్రసాదాల పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని స్పష్టం చేశారు. కేవలం ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా, అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను నిర్ధారించాలని ఆదేశించారు. టీటీడీ తీసుకున్న ఈ చర్యలు శ్రీవారి ప్రసాదాల పట్ల మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సందర్శన

భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు, రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్య క్షేత్రం కావడంతో జనసాంద్రత, దర్శన‑సమయాలను సమర్థంగా నిర్వహించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.

AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ద్వారా జనసాంద్రత, దర్శనం కొసం వేచి ఉండే సమయం, వాహన చలనం, వసతి, సీసీటీవీ వాతావరణం, వైద్య అత్యవసరాలు అన్నీ ఒకే ప్లాట్‌ఫారం ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు. AI‑ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు అయిందని అంటున్నారు. దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు ఈ కేంద్రం స్పూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.