చంద్రబాబుకు మహిళా మంత్రులు ప్లస్సా.. మైనస్సా.. తేల్చేశారు..!
అయితే అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు తాజాగా మరోసారి మంత్రి సవితకు సూచించారు.
By: Tupaki Desk | 29 Jun 2025 9:15 AM ISTచంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో మహిళా మంత్రులుగా ముగ్గురు ఉన్నారు. హోం శాఖ మంత్రిగా అనిత. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సంజీవరెడ్డి గారి సవిత. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు మహిళా మంత్రుల విషయంపై సీఎం చంద్రబాబు ఒకింత సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఆయన ఒకింత అసంతృప్తినే కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న సూచనలు వంటివి ఆయన సంతృప్తి అసంతృప్తులను కూడా బయటపెడుతున్నారు.
ముఖ్యంగా హోం శాఖ మంత్రిగా ఉన్న అనిత విషయంలో చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. విపక్షాలు సహా కొందరు నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శలకు గుప్పిస్తున్నా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చంద్రబాబు మంచి మార్కులే వేస్తున్నారు. ఎక్కడ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకపోవడం. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా జాగ్రత్తగా వ్యవహరించడం వ్యూహాత్మకంగా అడుగులు వేయటం వంటివి మంత్రి అనితకు కలిసి వస్తున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో అనిత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దగ్గర కూడా ఈ చర్చకు అవకాశం కల్పించింది.
మరోవైపు నియోజకవర్గంలో కూడా అనిత ప్రస్తుతానికి పాజిటివ్ యాంగిల్ లోనే ఉన్నారు. పార్టీలో చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ మంత్రిగా ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్టీలో కూడా నాయకులు సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. ఇక సంజీవరెడ్డి గారి సవిత విషయానికి వస్తే.. ఇంట్లో ఈగలు మోత.. బయట పల్లకిల మోత అన్నట్టుగా ఆవిడ పరిస్థితి ఉంది. అంటే ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలను ఆమె సర్దు బాటు చేయలేక పోతున్నారు. కానీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆమెకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి కష్టపడుతున్న మంత్రిగా సవితకు మంచి మార్కులు వేశారు.
ముఖ్యంగా మహానాడు సమయంలో ఆమె సైకిల్ యాత్ర చేపట్టడం అందరికీ భిన్నంగా వ్యవహరించడం చంద్రబాబు దగ్గర మంచి మార్కులు వేసేలా చేసింది. అయితే అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు తాజాగా మరోసారి మంత్రి సవితకు సూచించారు. బయట ఎంత మంచి పేరు ఉన్న రేపు నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉంటుందని, కాబట్టి అంతర్గతంగా వస్తున్న విభేదాలను అంతర్గత కుమ్ములాటాలను తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
ఇక, గిరిజన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విషయానికి వస్తే ఈమె కూడా మంచి మార్కులు తెచ్చుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తరచుగా ప్రతిపక్షంపై టార్గెట్ చేయకపోయినా... స్థానికంగా మాత్రం ఆమె వ్యవహరిస్తున్న తీరు, సమస్యలపై స్పందిస్తున్న విధానం.. వంటివి మంత్రికి మంచి మార్కులు వేయించాయి. దీంతో మొత్తం ముగ్గురు మహిళ మంత్రుల విషయాలను చంద్రబాబు సంతృప్తి గానే ఉన్నారనేది పార్టీ సీనియర్లు చెబుతున్న మాట.
