నెల రోజులు ఎవరూ కనిపించొద్దు.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 4 July 2025 10:27 AM ISTకూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ‘తొలి అడుగు’ పేరుతో గ్రామ బాట పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన నియోజకవర్గం కుప్పంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలో నెంబర్ టు మంత్రి లోకేశ్ సైతం మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి ఎంతో ప్రధానమైన ‘తొలి అడుగు’ కార్యక్రమం ఎటువంటి విరామం లేకుండా కొనసాగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నెల రోజులు ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. అధికారిక పనులు అంటూ ఏ ఒక్కరూ అమరావతిలో కనిపించకూడదని స్పష్టం చేశారు. నెల రోజులు పాటు ఎమ్మెల్యేలు ఎవరూ తన కంట పడకూడదని, పార్టీ కార్యకర్తల నుంచి అధినేత వరకు అంతా ‘తొలి అడుగు’లోనే మమేకమవ్వాలని చెప్పారు.
‘తొలి అడుగు’ కార్యక్రమం ఓ దిద్దుబాటు అవకాశంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ తొలి ఏడాదిలో కొంత మంది ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొందరు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలోకి వెళితే ప్రజల్లో స్పందన ఎలా ఉందన్న విషయమై ఓ అంచనాకు రావొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ ఇతర నామినేటెడ్ పదవులు పొందిన నేతలతోపాటు జిల్లా, మండల స్థాయి నేతలు అంతా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన పనులు ప్రచారం చేయడంతోపాటు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచిస్తున్నారు సీఎం.
2019 నాటి పరిస్థితి 2029లో పునరావృత్తం కాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు నియోజకవర్గాల్లో ‘తొలి అడుగు’ ఎలా జరుగుతున్నది అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించారు? ఎవరు హాజరయ్యారు? వంటి వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేసేలా పర్యవేక్షించేందుకు కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ‘తొలి అడుగు’ను నిర్లక్ష్యం చేస్తూ ఎవరూ నియోజకవర్గం దాటి రావొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల రోజులు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ ఎమ్మెల్యే కనిపించకూడదన్న చంద్రబాబు ఆదేశాలు చర్చనీయాంశమవుతున్నాయి.
