Begin typing your search above and press return to search.

మనకీ 2 కళ్ల సిద్ధాంతం అవసరమా చంద్రబాబు?

మరి.. ఆ మాట తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వినిపించిందా? లేదా? అన్నది అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 July 2025 1:00 PM IST
మనకీ 2 కళ్ల సిద్ధాంతం అవసరమా చంద్రబాబు?
X

ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి తెలంగాణ సాధన సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ నినాదం ఒకటి తాజాగా ఆయన నోటి నుంచి వచ్చింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఇప్పటి బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ అధినేత వరకు సగటు తెలంగాణ వాది నోటి నుంచి తరచూ వినిపించే మాట ఒకటి తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.

దీనికి కారణం.. తెలంగాణ సాధనలో భాగంగా చేపట్టిన ఉద్యమంలో చెప్పిన ఈ మాటను.. ఆ తర్వాతి కాలంలో పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ నోటి నుంచి కానీ ఆయన పుత్రరత్నం కేటీఆర్ నోటి నుంచి కానీ ఆ మాటకు వస్తే.. గులాబీ నేతల నోటి నుంచి రానే రాలేదు. ఇంతకూ ఆ మాట మరేదో కానీ.. విడిపోయినా కలిసి ఉందామని. ప్రాంతాలుగా విడిపోదామని.. తెలుగు వారిగా కలిసి ఉందామన్న మాట తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా వినిపించేది.

మరి.. ఆ మాట తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వినిపించిందా? లేదా? అన్నది అందరికి తెలిసిందే. ఇదంతా ఎందుకంటే.. కొద్ది రోజులుగా గోదావరి మీద ఏపీ నిర్మిస్తానని చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంతో పాటు.. వివిధ అంశాలపై ఢిల్లీ వేదికగా జరిగిన భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవటం.. కూర్చొని మాట్లాడుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాల మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగి.. పలు నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

ఈ భేటీ అనంతరం మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసి ఉందామన్న కీలక వ్యాఖ్య చేయటం విశేషం. ‘‘50 ఏళ్ల గోదావరి వరద లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఎగువ రాష్ట్రాలన్నీ వాడుకున్నాక మిగిలిన జలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా రాష్ట్రావసరాల కోసం వినియోగించుకోవడం పోలవరం-బనకచర్ల పథకం ఉద్దేశం. గోదావరి జలాల్లో మా రాష్ట్ర వాటా మేరకే దీనిని చేపడుతున్నాం. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డుచెప్పను. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు కలిసే ఉంటారు’’ అని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.

ఈ వ్యాఖ్యలు విన్న వారికి.. ఇదే మాటను కేసీఆర్ అండ్ కో ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఇప్పటికి రెండు కళ్ల సిద్దాంతం పఠించటం అవసరమా?అని తప్పు పట్టే వారు లేకపోలేదు. అయితే.. ఈ విమర్శల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన.. తన రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తప్పించి.. ఇంకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించటం మంచి పద్దతి కాదు. తెలుగు నేల రాష్ట్రాలుగా విడిపోవచ్చు. కానీ.. ఇద్దరిమధ్య సోదర భావం మిస్ కాకూడదు. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న వారు.. తమ రాష్ట్రంతో పాటు పక్కనున్న తెలుగు రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకోవటం తప్పేం కాదు. మన ఇల్లు మాత్రమే కాదు.. పక్కన ఉన్న ఇంటోడు బాగుండాలని అనుకోవటం తప్పు కాదు కదా?ఇది కూడా అలాంటిదే.