తెలంగాణ తలసరి ఆదాయంపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు.. మరో క్రెడిట్ వార్ కు తెర తీశారా?
కేవలం అవగాహన ఒప్పందాలకే (MoU) పరిమితం కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మలిచేలా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని సీఎం తెలిపారు.
By: Tupaki Political Desk | 8 Oct 2026 5:00 PM ISTతెలంగాణ తలసరి ఆదాయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కారణంగానే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందంటూ గొప్పగా చాటుకున్నారు. 1990ల్లో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాదును ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేశానని, అప్పుడు తీసుకున్న చర్యలతో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. ఇక సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య/కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 1995-96లో సీఐఐని ప్రమోట్ చేశానని, ఈ ప్రకారం సీఐఐపై తనకే మొదటి హక్కులు ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారు. మొత్తానికి సీఎం చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ నేతల మధ్య క్రెడిట్ వార్ కు తెరతీసినట్లైందని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలు అంశాలపై అధికార, విపక్షాల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అందులో తమ భాగస్వామ్యం ఉందని ప్రతిపక్షం వైసీపీ ఎత్తిచూపుతోంది. ఈ వాదనను ఖండిస్తూ వస్తోంది అధికారపక్షం. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రం తలసరి ఆదాయానికి క్రెడిట్ తనదే అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఐటీ అభిృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే అడుగులు పడ్డాయని చెబుతుంటారు. అయితే 2004 తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్, తాజాగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయని వాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు తాజా ప్రకటనపై ఆయా పార్టీల నేతల స్పందన ఉత్కంఠ రేకెత్తిస్తోందని అంటున్నారు. సీఎం చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఐటీ అభివృద్ధికి తమ పదేళ్ల పాలనే కారణమని చెప్పుకుంటుంటారు. ఇక ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు క్రెడిట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు మరోసారి పెద్ద రాజకీయ చర్చకు తెరతీశారని అంటున్నారు.
మరోవైపు ఢిల్లీలో జరిగిన సీఐఐ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్న వైనంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు విశాఖలో సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. 25 ఏళ్లుగా నిరంతరాయ ప్రజాసేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో డిజిటల్ ఇన్‌ఫ్రా, బలమైన రోడ్డు, రైల్వే నెట్‌వర్క్‌లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటులో ప్రధాని మోదీ పాత్ర కీలకమని కొనియాడారు.
పెట్టుబడులే లక్ష్యం
కేవలం అవగాహన ఒప్పందాలకే (MoU) పరిమితం కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మలిచేలా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని సీఎం తెలిపారు. గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని, గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చాయని వెల్లడించారు. గతేడాది ప్రకటించిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను నవంబర్ 12, 13 తేదీల్లో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా యాక్ట్‌ను రద్దు చేసినట్లు గుర్తుచేశారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్, మచిలీపట్నంలో గోవా షిప్ యార్డు సంస్థ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని తెలిపారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలలో డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయగా, రక్షణ శాఖ ఆధ్వర్యంలో 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును రాయలసీమలో ప్రారంభించినట్లు చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాలకు పెద్దపీట
500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై ఒప్పందాలు కుదిరాయని, త్వరలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బ్లూ ఎకానమీలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలో ఏఐ (AI) స్టాక్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, విశాఖకు చేరుకునేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా పాఠ్యాంశాలను మారుస్తున్నామని, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను 'స్వయం' బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్ చేస్తామని చెప్పారు.
