Begin typing your search above and press return to search.

చంద్రబాబు సుత్తి వినలేక వెళ్ళిపోయారా ?

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గంటల తరబడి ప్రసంగాలు చేస్తారు. అందులో చెప్పినదే చెబుతూ ఉంటారు అన్న భావన ఉంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 8:00 PM IST
చంద్రబాబు సుత్తి వినలేక వెళ్ళిపోయారా ?
X

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గంటల తరబడి ప్రసంగాలు చేస్తారు. అందులో చెప్పినదే చెబుతూ ఉంటారు అన్న భావన ఉంది. నిజానికి చూస్తే బాబు మంచి వక్త కాదని అంటారు. ఆయన మామ ఎన్టీఆర్ చాటు అల్లుడుగా ఉన్నపుడు నోట ఒక్క మాట వచ్చేది కాదని అనాడు ఆయనను దగ్గరగా చూసిన వారు అంటారు. ఎపుడైతే ఎన్టీఆర్ నుంచి అధికారం కైవసం చేసుకున్నారో ఆనాటి నుంచి బాబు తన ప్రసంగాలకు పదును పెట్టారు. ఎన్టీఆర్ లాంటి గ్లామర్ ఫిగర్ నుంచి పార్టీని తీసుకున్న తరువాత ఆ లోటుని భర్తీ చేయడం కోసం జనాలను తన వైపుగా ఆకట్టుకోవడం కోసం చంద్రబాబు సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తూ వచ్చారని చెబుతారు. మొదట్లో అవి బాగున్నా రాను రానూ అధిక ప్రసంగాలుగా మారుతున్నాయన్నది పార్టీలో వినిపిస్తున్న మాట.

ఇదిలా ఉంటే టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎన్నో ఆశలతో చంద్రబాబు పెట్టారు. లోకేష్ తన తరువాత నాయకుడు అని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. తన ప్రసంగంలోనూ లోకేష్ ని ప్రశంసించారు. ఎపుడూ గెలవని మంగళగిరిలో గెలిచి లోకేష్ చూపించారు అని మెచ్చుకున్నారు. లోకేష్ ని స్పూర్తిగా తీసుకుని మీరు కూడా కష్టపడాలని సూచించారు.

లోకేష్ అసలైన హైకమాండ్ అని సీఎం తరువాత అంతటి మనిషి కాబట్టి మంగళగిరిలో డెవలప్మెంట్ చేయడానికి ఏదో రూపంలో ఫండ్స్ వస్తాయి, మరి మాకు ఎవరు ఫండ్స్ ఇస్తారు అని హాజరైన ఎమ్మెల్యేలు అంటున్నారుట. మా నియోజకవర్గాలలో డెవలప్మెంట్ కి మేము ఫండ్స్ అడిగితే మా అవినీతి అని అంటూ చెప్పి మాకే క్లాస్ పీకుతున్నారని చాలా మంది వాపోతున్నారు. దీని వల్లనే మీటింగ్ కి వచ్చి కూడా చాలా మంది మధ్యలో వెళ్ళిపోయారు అని అంటున్నారు.

ఇక సంతకాలు పెట్టేసి మరీ అనేక మంది అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోయారని అంటున్నారు. ఇవన్నీ టీడీపీ అనుకూల చానళ్ళలోనే స్క్ర్లోలింగ్ గా రావడం విశేషం అంటున్నారు. దీని ప్రకారం చూస్తే ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు మీటింగుకే రాలేదు అని లెక్క తేలిందట. ఇక వచ్చిన వారిలో ఓపికగా కూర్చోకుండా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారని అంటున్నారు.

అధికారంలోకి వచ్చి జస్ట్ ఏడాది మాత్రమే అయింది. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరని అంటే ఎవరు పనిచేస్తారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాలలో నడుస్తోందిట. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి 164 సీట్లు వచ్చాయంటే అది పూర్తిగా పాజిటివ్ ఓటు కాదని టీడీపీ కూటమిని చూసి వేసిన వారి కంటే కూడా జగన్ ప్రభుత్వం చేసిన చర్యల వల్ల ఆ అయిదేళ్ళ పాలనకు విసిగి మాత్రమే జనాలు ఇటు తిరిగి ఓటు వేశారు అని అంటున్నారు.

సరే ఈసారి అధికారం దక్కింది. మళ్ళీ వస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా అన్నది కూడా చాలా మందిలో అంతర్మధనం గా ఉంది అని అంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్ తోనే ఇపుడు సంపాదించకపోతే మరెప్పుడు సంపాదించాలి అన్న విధంగా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అన్నీ మూసుకుని అటు సంపాదించకుండా ఇటు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకుండా పూఅతే రెండిందాలుగా చెడిపోతాం కదా అన్న దూరదృష్టితోనే చాలా మంది ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

తమ పిల్లలు వారి భవిష్యత్తు అని అనేకమంది ఆలోచించుకుంటున్నారు. ఈ కారణం వల్లనే అధినాయకత్వం చెప్పే సూక్తి ముక్తావళి ఎవరి బుర్రకు ఎక్కడం లేదని అంటున్నారు. అన్నింటికీ మించి చెప్పినదే చెబుతూ ఆత్మ

స్తుతి పర నింద వంటి వాటిలో బాబు బోర్ కొట్టించేస్తున్నారు అన్నదే చాలా మంది మాటగా ఉంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని మమేకం కావాలని చెబుతున్నారు. కానీ రాజకీయం అంటేనే ధన ప్రభావంతో కూడుకున్నదిగా మారిపోయింది.

దాంతో ఇపుడు అధికారంలో ఉండగా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకుంటేనే రేపటి రోజు అన్నది ఉంటుందని చాలా మంది భావిస్తున్నారుట. మొత్తానికి చూస్తే కనుక బాబు ఎంతో ఆశగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం చివరికి ఆయనలోనూ తీవ్ర అసంతృప్తిని కలుగచేసింది అని అంటున్నారు. మరి ఎమ్మెల్యేల తీరు మారుతుందా అంటే వారి ఆలోచనలు ఒకలా ఉన్నాయని అధినాయకత్వం 2029 అని ఇప్పటి నుంచే పరుగులు పెట్టించేస్తే రెడీ అయ్యేవారు ఎంత మంది అన్న చర్చ అయితే సాగుతోంది.