Begin typing your search above and press return to search.

టీడీపీ కమిటీల ఎంపిక.. చంద్రబాబుకే సాధ్యం కావడం లేదా?

టీడీపీలో జిల్లా కమిటీల ఎంపిక అధినేత చంద్రబాబుకు సవాల్ గా మారిందా? అనే చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   10 Dec 2025 10:00 PM IST
టీడీపీ కమిటీల ఎంపిక.. చంద్రబాబుకే సాధ్యం కావడం లేదా?
X

టీడీపీలో జిల్లా కమిటీల ఎంపిక అధినేత చంద్రబాబుకు సవాల్ గా మారిందా? అనే చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితమే జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అవ్వాల్సివుండగా, ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదని అంటున్నారు. ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవులతోపాటు కార్యవర్గంలో చోటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉందని, దీంతో ఏకగ్రీవంగా కమిటీలను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారిందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొందరు సీనియర్లకు ఈ బాధ్యతను అప్పగించిన చంద్రబాబు.. గతంలో మాదిరిగా సులువుగా జిల్లా కమిటీల ఎంపిక పూర్తి చేయొచ్చని భావించారని, కానీ, నేతల మధ్య పోటీతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్బంగా పార్టీ కమిటీలను నియమిస్తుంటుంది. మహానాడుకు ముందు జిల్లా కమిటీలు, మహానాడు తర్వాత రాష్ట్ర, జాతీయ కమిటీ నియామకం ఉంటుంది. అయితే గత ఏడాది ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలో పదవులతోపాటు నామినేటెడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన తర్వాత పార్టీ పదవులకు నియామకాలు చేయాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. ఎన్నడూ లేనట్లు గత ఏడాదిలో చాలావరకు నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి చేశారు.

అంతవరకు అధినేత మాట ప్రకారం అంతా నడిచినా, పార్టీ జిల్లా కమిటీల ఎంపిక మాత్రం కొలిక్కి రావడం లేదు. దీంతో గత ఆగస్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్లు అంతా తీవ్ర కసరత్తు చేస్తున్నా జిల్లా కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎంపిక చేయలేకపోతున్నారని అంటున్నారు. నిజానికి జిల్లా కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీలు ఆగస్టులోనే సంస్థాగత ఎన్నికల కసరత్తు కొలిక్కి తీసుకురావాల్సివుండేది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 34 మంది సభ్యులతో టీడీపీ పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేయాలని త్రిసభ్య కమిటీకి పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే పలు జిల్లాల్లో తీవ్ర పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

దీంతో చేతులెత్తేసిన నేతలు పార్టీ అధినేత చంద్రబాబుపై భారం మోపారు. ఇక రంగంలోకి దిగిన చంద్రబాబు.. గత రెండు నెలలుగా వారంలో ఒక రోజు ఈ పనిపై దృష్టిపెట్టినా, ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా? అని సందేహిస్తున్నారు. పార్టీలో చంద్రబాబే సుప్రీం. కానీ, గత ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొన్న కేడర్ ను బాధపెట్టకూడదనే ఉద్దేశంతో పార్టీ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా మరో మూడు నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికలు ఉండటంతో పార్టీ పదవులకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోందని అంటున్నారు.

పార్టీలో అధికారంలో ఉండటం, స్థానిక ఎన్నికల సమయం సమీపించడంతో జిల్లా కమిటీలపై నేతలు ఎక్కువ మోజు చూపుతున్నారు. ప్రభుత్వ పరమైన పదవులు లేకపోయినా, పార్టీ పదవులు ఉంటే తమ ప్రాంతంలో విలువ ఉంటుందనే భావనతో ఎక్కువ మంది నేతలు జిల్లా అధ్యక్ష పదవులను ఆశిస్తున్నారని అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు.. పార్టీ సీనియర్లతో చర్చిస్తూ జిల్లా కమిటీలను త్వరగా నియమించేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.