Begin typing your search above and press return to search.

వైసీపీ ఓటు బ్యాంకు పతనం ...బాబు సరి కొత్త వ్యూహం !

రాష్ట్రంలో వైసీపీ ఓటు బ్యాంకు ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయిందని బాబు విశ్లేషించి మరీ చెప్పారు.

By:  Satya P   |   29 Oct 2026 8:41 AM IST
వైసీపీ ఓటు బ్యాంకు పతనం ...బాబు సరి కొత్త వ్యూహం !
X

చంద్రబాబు రాజకీయం దాదాపు అయిదు దశాబ్దాల నాటిది. అందుకే ఆయన్ని తట్టుకుని నిలిచి గెలవడం కష్టం. జనాలో ఆదరణ ఉందని లేదా తమకు ఇమేజ్ ఉందని లేదా మంచి ఓటు బ్యాంక్ ఉందని ఎవరు అనుకున్నా పొరపడినట్లే. బాబు మార్క్ వ్యూహాల ముందు ప్రత్యర్ధులు ఎందరో తట్టుకోలేక చతికిలపడ్డారు. అయితే వైసీపీ మాత్రం గత పుష్కర కాలంగా మూడు ఎన్నికల నుంచి పోరాడుతోంది. ఇక 2029 ఎన్నికల్లో వైసీపీని మరోసారి ఓడించి వీలైనంత బాగా తగ్గించాలని చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. తాజాగా ఆయన కూటమి నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత తగ్గిస్తే అంతగా రాష్ట్రం బాగు పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 45 వేల మంది నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కూటమి పార్టీల క్యాడర్ తో :

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ బీజేపీ జనసేనలకు చెందిన 45 వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొనడం విశేషం. నిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంతటి భారీ స్థాయిలో బాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ ని నిర్వహించడమే కాదు కూటమి పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితో విస్తృత స్థాయిలో తొలిసారి ఈ విధంగా మాట్లాడడం విశేషం. చంద్రబాబు టీడీపీ క్యాడర్ తో ఎపుడూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. వారికి అది అలవాటు, మిత్ర పక్ష పార్టీలకు బాబుతో స్వయంగా ఈ తరహా మీటింగులో పాల్గొనడం కొత్త అనుభూతి. అదే సమయంలో బాబు చెప్పే మాటలు వారు స్వయంగా వినడం ద్వారా కూటమి ఐక్యతకు అది మరింతగా దోహదపడుతుందని అంటున్నారు.

గొడ్డలి పార్టీ కుట్రలు :

రాష్ట్రంలో వైసీపీ ఓటు బ్యాంకు ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయిందని బాబు విశ్లేషించి మరీ చెప్పారు. అందువల్ల రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ ఓటు బ్యాంకు మరింత తగ్గాల్సిన అవసరం ఉందని బాబు కూటమి పార్టీల క్యాడర్ అంతటికీ పిలుపు ఇవ్వడం విశేషం. అందుకోసం కూటమి పార్టీల క్యాడర్ అంతా ఏక త్రాటిపైకి వచ్చి పనిచేయాలని బాబు పిలుపు ఇచ్చారు. ఏపీలో వైసీపీ ఓటు బ్యాంకు పతనంతోనే ఏపీ అభివృద్ధికి అతి పెద్ద సూచికగా మారుతుందని అన్నారు. అందువల్ల మూడు పార్టీల క్యాడర్ అంతా ఒక్కటిగా జనంలోకి వెళ్ళి గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలకు తెలియచేయాలని కోరారు.

మంచి పాలనకే ఓటు :

ప్రజలు ఎపుడూ అభివృద్ధి వైపే ఉంటారు అని బాబు స్పష్టం చేశారు. ఏపీలో గత రెండున్నరేళ్లుగా కూటమి నేతృత్వంలో సుపరిపాలన సాగుతోంది అని చెప్పారు. ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చిన విజయాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుని పరిపాలన చేస్తున్నామని అన్నారు. ఇదే విషయం జనాలకు వివరించాలని ఆయన కోరారు. సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు.

గ్రౌండ్ లెవెల్ లో ఐక్యతకు :

పై స్థాయిలో చూస్తే చంద్రబాబు పవన్, మాధవ్ ల మధ్య ఐక్యత ఉంది. అదే ఐక్యత సఖ్యత గ్రౌండ్ లెవెల్ లో కూడా ఉండాలని భావించి బాబు సరి కొత్త ప్రయోగం చేశారు. కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ తో లీడర్లతో ఆయనే నేరుగా మాట్లాడారు, ఎన్నికల్లో రెబెల్స్ గా పోటీ చేయవద్దు అన్నారు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీని అధికారానికి అవకాశాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. మరి బాబు చేసిన హితోపదేశం కూటమి పార్టీలకు కనుక గట్టిగా ఒంటబడితే మూడు పార్టీలు ఒక్కటిగా మారి ఏపీలో స్థానిక ఎన్నికల నుంచి గట్టిగా నిలబడితే తట్టుకోవడం వైసీపీకి కష్టమే అన్న భావన అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.