Begin typing your search above and press return to search.

అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !

రాజకీయాల్లో గెలుపు ఆశలు ఉండొచ్చు. కానీ అవి రెక్కలు విప్పుకుని మరీ ప్రజాస్వామ్య సూత్రాలను దాటి వెళ్ళిపోరాదు, అధికార దుర్వినియోగంగా మారరాదు.

By:  Satya P   |   28 Oct 2026 12:12 PM IST
అప్పుడు వైనాట్ కుప్పం...ఇపుడు వై నాట్ పులివెందుల !
X

రాజకీయాల్లో గెలుపు ఆశలు ఉండొచ్చు. కానీ అవి రెక్కలు విప్పుకుని మరీ ప్రజాస్వామ్య సూత్రాలను దాటి వెళ్ళిపోరాదు, అధికార దుర్వినియోగంగా మారరాదు. అంతే కాదు ప్రజల ఆకాంక్షలను దాటి భిన్నంగా ఆలోచించరాదు. ఇది రాజుల కాలం కాదు కోటలను జయించుకోవడానికి, ఇది ప్రజాస్వామ్యం. జస్ట్ అయిదేళ్ళు మాత్రమే అక్కడ అధికారం ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే తీర్పు మారుతుంది. అయినా సరే ప్రజాస్వామ్యంలో రాచరిక పోకడలతో వై నాట్ అంటున్నారు రాజకీయ అధినేతలు. అందుకే నాడు కుప్పం జగన్ టార్గెట్ అయితే నేడు పులివెందుల చంద్రబాబు టార్గెట్ అయింది.

సమర్థింపు ఉందా :

నిజానికి రాజకీయ పార్టీలు మఠాలు కావు, మడి కట్టుకుని కూర్చోవడానికి. అవి రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నం చేస్తాయి, చేయాలి కూడా. అది తప్పు కానే కాదు, జగన్ కుప్పం గెలవాలనుకున్నా చంద్రబాబు పులివెందుల గెలిచి తీరాలనుకున్నా లక్ష్యాలలో విభేదించేవారు లేరు, కానీ అక్కడ పార్టీలు అమలు చేస్తున్న విధానాలనే అంతా తప్పు పడుతున్నారు. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రత్యర్థి పార్టీ క్యాడర్ ని వేధించి చివరికి గెలిచామని చెప్పుకోవడం వెనక సంతోషం కానీ సంబరం కానీ ఉండదు, అది ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే. జగన్ కి కుప్పంలో 2021లో కలిగిన తాత్కాలిక ఆనందం కాస్త 2024 నాటికి పూర్తిగా కరిగిపోయింది. ఎందుకంటే చంద్రబాబు కంచుకోట కుప్పాన్ని గెలిచామని జగన్ సంతోషపడినంత సేపు లేదు, ఏపీ మొత్తాన్ని టీడీపీ కూటమి కబలించి వైసీపీని అధికారంలో నుంచి దించేయడానికి పట్టిన సమయం. మరి నాడు తప్పు అని ఘోషించిన టీడీపీ వర్గాలు ఇపుడు పులివెందుల విషయంలో ఎలా ఒప్పు అనగలవని కూడా ప్రశ్నిస్తారు, అలాగే నాడు ఒప్పు అని కుప్పం కోట మీదకు రాజకీయ దండయాత్ర చేసిన వైసీపీకి ఈ రోజు పులివెందులలో టీడీపీ దండయాత్ర తప్పు ఎలా అనిపించిందో కూడా ఆలోచించాల్సిందే.

ఎందుకు ఆ రెండూ :

నిజానికి కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట అని భావిస్తారు. ఆయన 1989 నుంచి అక్కడ నుంచే గెలుస్తూ వస్తున్నారు. అందువల్ల కుప్పంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే బాబు కోటకు బీటలు వారాయని చెప్పవచ్చు అనుకుంది వైసీపీ. కానీ అలా జరగలేదు కదా, 2024లో మళ్ళీ చంద్రబాబు అక్కడ నుంచి గెలిచారు. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూడా గెలిచింది. ఇపుడు పులివెందుల మీద చంద్రబాబు టార్గెట్ చేశారు. పులివెందుల అంటే 1978 నుంచి వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట, వైఎస్సార్ నుంచి జగన్ దాకా వరసగా గెలుస్తూ వస్తున్నారు. అందువల్ల ఆ కోటను కొడితే జగన్ రాజకీయంగా సరి అన్నది టీడీపీ ఫిలాసఫీ. మరి కుప్పంలో టీడీపీని ఓడిస్తే 2024లో బాబు ఓడలేదు కదా మరి ఈ థియరీ కళ్ళ ముందు ఉంచుకుని మరీ ఈ రోజున పులివెందులలో అన్నీ గెలిచేశామని టీడీపీ సంబరపడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అన్నది ఒక చర్చ.

ప్రజలు గెలవాలి :

రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అవి ఒక వేదిక మాత్రమే. పైగా జనాలే ప్రభువులు. అలాంటి ప్రజలకే ఏ నియోజకవర్గాలు అయినా సొంతం అవుతాయి. వారే అక్కడ శాశ్వత ప్రతినిధులు తప్ప మధ్యలో ఉన్న నాయకులు కారని రాజకీయ పార్టీల అధినేతలకు ఎవరు చెబుతారు అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. కుప్పం కానీ పులివెందుల కానీ గెలవడం అంటే ఎన్నికల్లో ఓట్లు కాదు, అక్కడ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల మనసులు గెలవడం, ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమలు తీసుకుని రావడం, తాగు సాగు నీటి సదుపాయాలను కల్పించడం ఇది కదా గెలుపు అంటే. మరి ఆ అసలైన గెలుపు సూత్రాన్ని మరచిపోయి కోటలను జయించిన రాజుల కాలం నాటి రాజనీతిని ఉపయోగించడం సమంజసం అని ఎవరైనా అనగలరా. కానే కాదు అన్నదే సమాధానంగా వస్తుంది.

కంచు కోటలు కాదు :

ఏ సీటు అయినా ఎంతటి బలవంతుడు అయినా ప్రజల తీర్పునకు లోబడే గెలుస్తాడు, ఓడించాలి అనుకుంటే ప్రజలే ఆ పని చేస్తారు. ప్రజలు అలా చేయాలి అంటే దానికి రాజ మార్గమే ఉంది. ముందే చెప్పినట్లుగా ప్రజల మనసులను రాజకీయ పార్టీలు గెలుచుకుని అభివృద్ధి చేసిన పక్షంలో వారే ప్రత్యర్థిని ఓడించి తాము కోరుకున్న వారికి ఘన స్వాగతం పలుకుతారు. అంతే తప్ప షార్ట్ కట్ మెధడ్స్ తో అధికార దుర్వినియోగం చేసిన వేరే మార్గాలు అనుసరించినా ఆ గెలుపు తాత్కాలికమే అవుతుందని చరిత్ర నిరూపిస్తోంది. అయినా కుప్పాన్ని గెలిచామని జగన్ ఆనాడు సందేశం ఇస్తే కనీసం కుప్పం జనాలు అయినా రియాక్ట్ అయ్యారా. ఇపుడు పులివెందుల కధ కూడా ఇంతే. జనాలతోనే ప్రజాస్వామ్యంలో గెలుపు ఆట ఆడాలి. అది మరచి రాజకీయ ప్రత్యర్ధుల మీదకు దారి మళ్ళిస్తే ఆట కట్టు తప్పుతుంది. చివరికి గెలుపు పట్టు జారుతుంది. ఏపీలో రెండు పార్టీలు ఇద్దరు రాజకీయ ప్రత్యర్ధులు అని చెప్పుకోవడానికి ఈ రెండు నియోజకవర్గాలను ముందుకు తెస్తున్నారు తప్ప నిజానికి కుప్పం పులివెందుల మాత్రమే ఏపీలో లేవు, మొత్తం ఏపీ ప్రజల కోసం పనిచేయడం అన్న సిద్ధాంతాన్ని విధానంగా మార్చుకుంటే ఈ విధమైన పోటీలు టార్గెట్లూ ఉండనే ఉండవని కూడా మేధావులు అంటున్నారు.