బాబులో భగవంతుడిని చూస్తూ నగదుని లెక్కబెట్టుకునే నెల !
కష్టాలు ఉన్నపుడు తీర్చేవారినే దేవుడు అని అంటారు. అలా చూస్తే పాలకులు కూడా ప్రజల కష్టాలు తీరుస్తూ దేవుళ్ళుగా మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
By: Tupaki Desk | 13 May 2025 9:33 AM ISTకష్టాలు ఉన్నపుడు తీర్చేవారినే దేవుడు అని అంటారు. అలా చూస్తే పాలకులు కూడా ప్రజల కష్టాలు తీరుస్తూ దేవుళ్ళుగా మారిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు అయితే తమ పాలనలో చేసిన మేళ్ళకు దివంగతులైనా కూడా దేవుడు మాదిరిగా గుండెలలో ప్రజలు పెట్టుకుంటున్నారు. అలా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్సార్ ఈ రోజుకీ బతికి ఉన్నారు.
ఇక చూస్తే ఏపీలో కూటమి పాలన ఏడాదికి దగ్గర పడుతోంది. జూన్ నెలలో చూస్తే 12 కి సరిగ్గా తొలి వార్షికోత్సవం జరుగుతుంది. ఇలా ఏడాది పండుగ గుర్తుండిపోయేలా సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంపడుతున్నారు.
ఇక జూన్ నెల అంటే కొత్త ఆర్ధిక సంవత్సరంలో వచ్చే మూడవ నెల. నిజానికి ఖర్చుల నెలగా కూడా చెప్పాలి. బడ్జెట్ బరువై భారమైన నెలగా కూడా చెబుతారు. ఎందుకు అంటే ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది ఈ నెలలోనే అంటే రాష్ట్రంలో అత్యధిక శాతం జనాలకు వ్యవసాయం ఆధారం వారికి ఈ నెలలోనే సాగు ఖర్చు ఉంటుంది.
అలా రైతులకు పెట్టుబడులకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. వారు ఈ సమయంలో అప్పుల కోసం అన్ని చోట్లా తిరుగుతూ ఉంటారు. అంతే కాదు అందరి గుమ్మాల వద్ద పడిగాపులు కాస్తారు. అయితే ఈసారి ఆ బాధ లేకుండా అన్న దాతా సుఖీభవ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఖాతాలో వ్యవసాయ సాయం కింద ఆర్ధిక మొత్తాన్ని వేయనుంది. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చినా ఇపుడు ఈ పధకం సరైన సమయంగా చూసి అమలు చేయాలని కూటమి భావిస్తోంది.
దాంతో పాటు కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ పధకంతో కలిపి ఇస్తుంది. దాంతో రైతులకు పంట పెట్టుబడికి తగిన మొత్తం సమకూరుతుది అని అంటున్నారు. ఇక విద్యా సంవత్సరం కూడా జూన్ నెలలో మొదలవుతుంది. దాంతో బిడ్డల చదువు కోసం అయ్యే సొమ్ము కోసం తల్లులు పడే వేదన రోదన అంతా ఇంతా కాదు ఇపుడు ఆ బాధ లేకుండా తల్లికి వందనం పేరుతో నిధులను విడుదల చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటున్నారు.
దాంతో చదువులకు పెట్టే పెట్టుబడి మొత్తాలు కూడా అంది వస్తాయని అంటున్నారు. వీటితో పాటు 18 ఏళ్ళ లోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ విధంగా సూపర్ సిక్స్ లో కీలకమైన మూడు పథకాలు ఒకేసారి ఒకే నెలలో అమలు అయితే కనుక ప్రతీ ఇంటా డబ్బులే డబ్బులు ఉంటాయని అంటున్నారు.
గతంలో వైసీపీ హయాంలో ప్రతీ పధకాన్ని ఏదో ఒక సమయంలో స్టార్ట్ చేసి ఎంతో కొంత నగదుని జనం వద్ద ఉంచేవారు. దాంతో వారు ఖర్చుకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగేవారు. ఇపుడు మళ్ళీ టీడీపీ కూటమి కూడా ఆ విధంగా చేయడమే కాదు అంతకు రెట్టింపు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవడానికి సిద్ధపడుతూండడంతో జూన్ నెలలో ఈ పధకాలను అందుకునే వారంతా చంద్రబాబే మా దేవుడు అని కొలిచి దండాలు పెట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి బాబులో భగవంతుడిని చూస్తూ చేతిలో నగదుని లెక్కబెట్టుకునే రోజు కోసమే అంతా వేచి ఉన్నారు అని అంటున్నారు.
