Begin typing your search above and press return to search.

పొత్తులపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. అలా చేస్తే సస్పెన్షనే!

స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీల మధ్య పొత్తు ధర్మం కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   29 Oct 2026 3:38 PM IST
పొత్తులపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. అలా చేస్తే సస్పెన్షనే!
X

స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీల మధ్య పొత్తు ధర్మం కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలోని పక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని, అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్కడైనా రెబల్స్ బరిలో ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీల కలిసి నిలబెట్టిన వారే కూటమి అభ్యర్థి అంటూ సీఎం స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి విరుద్దంగా పోటీ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.

రాష్ట్రమంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులు తాజా రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుతం మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ప్రచార పర్వం ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇంచార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో రెబల్స్ అంశంపై సీఎం, మంత్రులు కూలంకుషంగా చర్చించారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకున్నామని సీఎం గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి కాకుండా, ఎన్డీఏ కూటమిని చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అత్యంత సానుకూల వాతావరణం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.

రెబల్స్ దారిలోకి వస్తారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెబల్స్ దారిలోకి వస్తారా? అనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం రేపటితో ముగియనుండగా, 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఇప్పటికే పూర్తయింది. దీంతో పలుచోట్ల కూటమి సర్దుబాట్లను లెక్కచేయకుండా టీడీపీ నేతలు పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలకు తక్కువ సీట్లు ఇచ్చారనే అసంతృప్తి నడుమ పార్టీ నేతలు తిరుగుబాటు చేయడంపై సీఎం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. రెబల్స్ విషయంలో మెతక వైఖరి ప్రదర్శిస్తే మిత్రపక్షాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున మాట వినని వారిపై వేటు వేయాలని సీఎం స్పష్టమైన వైఖరి తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న వివాదాలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవాలని చివరి అవకాశం ఇవ్వాలని, లేదంటే సస్పెండ్ చేయాలని తెగేసి చెప్పారని చెబుతున్నారు.

మంత్రులకు ఎన్నికల బాధ్యతలు

ఇక మంత్రులు తమ సొంత నియోజకవర్గాలతో పాటు, ఇంచార్జి బాధ్యతలు చూస్తున్న జిల్లాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. "అభ్యర్థుల గెలుపు బాధ్యత పూర్తిగా మంత్రులదే" అని స్పష్టం చేశారు. ముందుగా పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత సొసైటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పట్నుంచే నాయకులు, కేడర్ అన్నింటికీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పూర్తిస్థాయి పాలనపై దృష్టి సారిద్దామని కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ నుంచి తలెత్తిన చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రజలు, కేడర్ నుంచి మంచి సానుకూల స్పందన వస్తోందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి సమన్వయంతో ముందుకు వెళ్తున్న తరుణంలో, రెబల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కూటమిలో క్రమశిక్షణ మరింత బలపడుతుందని నేతలు భావిస్తున్నారు.