Begin typing your search above and press return to search.

జనసేనకు కొత్త బలం ఇస్తున్న టీడీపీ రాజకీయం

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తెలివి తేటలను రాజకీయ వ్యూహాలను ఎవరూ తక్కువ చేయలేరు.

By:  Tupaki Desk   |   24 May 2025 8:00 AM IST
జనసేనకు కొత్త బలం ఇస్తున్న టీడీపీ రాజకీయం
X

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తెలివి తేటలను రాజకీయ వ్యూహాలను ఎవరూ తక్కువ చేయలేరు. ఆయనను అపర చాణక్యుడు అని కూడా అంటారు. అయితే చంద్రబాబు టీడీపీ కూటమిని కట్టిన తరువాత గతానికి కాస్తా భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎక్కువగా జనసేనకు బీజేపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

బాబు చూపు ఇపుడు వైసీపీ మీదనే ఉంది. ఏపీలో జగన్ ని రాజకీయంగా బలహీనం చేయాలని ఆయన ఆలోచిస్తూ ఆ దిశగానే రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలియకుండానే జనసేనకు బీజేపీకి సరికొత్త బలాన్ని ఇస్తున్నామన్న సంగతిని మరచిపోతున్నారు అని అంటున్నారు. సరిగ్గా ఇదే విషయాన్నే సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధినాయకత్వానికి గుర్తు చేస్తున్నారు.

బాబు వ్యవహార శైలి టీడీపీ తీరు మీదనే జ్యోతుల నెహ్రూ ప్రశ్నలు సంధించారు అని అంటున్నారు. పొత్తులు అంటే టీడీపీ నిర్వీర్యం కాకూడదు కదా అని ఆయన అంటున్నారు. వాస్తవానికి చూస్తే గోదావరి జిల్లాలలో జనసేన బలంగా ఉంది. ఆ పార్టీకి ఒక బలమైన సామాజిక వార్గం దన్నుగా ఉంది. మొత్తం 34 అసెంబ్లీ సీటు అయిదు ఎంపీ సీట్లు ఇక్కడ ఉన్నాయి.

జనసేన కూడా వ్యూహం ప్రకారమే గోదావరి జిల్లాల నుంచే తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. దానికి టీడీపీ రాజకీయం ఊతమిస్తోంది జనసేన ఉంది కదా అని ఒక బలమైన సామాజిక వర్గానికి టీడీపీలో మంత్రి పదవులతో సహా కీలక అవకాశాలలో కోత పడుతోంది.

అయితే పొత్తులు అన్నవి ఎల్లకాలం ఉండవని బాబు లాంటి వారికి తెలియనివి కావు అని అంటున్నారు. ఏపీలో టీడీపీకి వైసీపీ మాత్రమే ప్రత్యర్ధి అనుకోవడం కూడా పూర్తి స్థాయి రాజకీయ వ్యూహం కాదని అంటున్నారు. జనసేన కూడా బలమైన ప్రత్యర్ధిగా భవిష్యత్తులో అవతరిస్తుంది అన్న సత్యాన్ని కావాలనే టీడీపీ పెద్దలు విస్మరిస్తున్నారా అని కూడా చర్చ సాగుతోంది.

నిజానికి పవన్ కి రాజకీయం తెలియదు అనుకుంటే పొర్పాటు అంటున్నారు. ఆయన చాలా చాకచక్యంగా పదేళ్ళ తన రాజకీయ జీవితంలో బాబు తరువాత స్థానం అయిన ఉప ముఖ్యమంత్రి హోదాను అందుకున్నారు. తాను లేకపోతే టీడీపీకి అధికారం లేదన్న ఆలోచనలకు కలిగించారు. అలాగే కేంద్ర స్థాయిలో బలమైన బీజేపీతో గట్టి స్నేహ బంధం కలిగి ఉన్నారు.

పవన్ కి గ్లామర్ ఉంది. పొలిటికల్ గా బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. బలమైన ప్రాంతాలలో జనసేన ఉనికి ఉంది. దాంతో జగన్ తో సమానంగా పవన్ కూడా టీడీపీకి సవాల్ విసరగలరు అన్న దానిని టీడీపీ విస్మరిస్తోందా అన్నదే టీడీపీ సీనియర్ల విశ్లేషణగా ఉంది అని అంటున్నారు.

నిజానికి పొత్తులు కుదిరి ఒకసారి అధికారంలోకి వచ్చాక టీడీపీ మిత్రులకు దూరంగా పెడుతుంది. కానీ ఈసారి చిత్రంగా చంద్రబాబు తనతో పాటుగా సమానంగా మిత్ర నేతలను గౌరవిస్తున్నారు. పవన్ ఫోటో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతీ ఆఫీసులో ఉంచారు. అలాగే ఏ మీటింగ్ జరిగినా ప్రోటోకాల్ పాటించి పవన్ కి తన పక్క సీటు కేటాయించాలని ఆదేశించారు.

జనసేనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలు కూడా కీలకమైనవి అని అంటున్నారు. అలాగే నామినేటెడ్ పదవులలో కూడా ముఖ్యమైనవి జనసేనకు చాలానే దక్కాయని అంటున్నారు. ఇలా కేవలం 21 మంది ఎమ్మెల్యేలతోనే జనసేన టీడీపీతో సమానంగా రాజకీయ రాజసాన్ని ప్రదర్శిస్తోంది. పొత్తులు స్నేహాలు ఇలాగే కొనసాగితే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. కానీ రాజకీయాల్లో దేనినీ శాశ్వతం అని ఎవరూ చెప్పలేరు.

అలా కధ అడ్డం తిరిగితే మన పరిస్థితి ఏంటన్నదే టీడీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే వామపక్షాలను పొత్తు పేరుతో పిలిచి నిర్వీర్యం చేసినట్లుగా ఈ మిత్రులను చేయాలని వారు కోరుతున్నట్లుగా ఉంది. కానీ బాబు మాత్రం అలా చేయడం లేదు అంటున్నారు. బీజేపీకి రెండు రాజ్యసభ ఎంపీలు ఇవ్వడం కూడా అందులో భాగమే అంటున్నారు.

ఒక్కసారి వైసీపీ కనుక ఏపీలో బలహీనం అయితే ఆ ప్లేస్ లోకి కచ్చితంగా జనసేన బీజేపీ కాంబో వస్తుందని కూడా అంటున్నారు అపుడు వైసీపీ కంటే బలమైన ప్రత్యర్ధులుగా వారిని చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే చంద్రబాబు 2019 నాటి ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఈ రెండు పార్టీలు లేకుండా అధికారంలోకి రావడం జరగదని భావిస్తూ వారికి పెద్ద పీట వేస్తున్నారు అని అంటున్నారు. మరి బాబు రాజకీయ ఈక్వేషన్స్ ఏమిటో తెలియక తమ్ముళ్ళు తికమక పడుతున్నారు.