‘‘మీలో చైతన్యం రావడం లేదు.. నా అవసరం కోసం చెప్పడం లేదు’’ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చీరాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో సీఎం పర్యటించారు.
By: Tupaki Political Desk | 7 Aug 2026 10:44 PM ISTచీరాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పలు అంశాలపై సీఎం వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ప్రజలు సరిగా వినియోగించుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజల్లో చైతన్యం ఉండటం లేదని, నా అవసరం కోసం చెప్పడం లేదు’’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు సభికులను ఆలోచనకు గురిచేశాయని అంటున్నారు.
‘‘సోలార్ ప్యానెల్స్ ను మీ ఇంటిపై పెట్టుకుని కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. కరెంటు బిల్లు ఉండదు. రెండోది స్టౌ పెట్టుకుంటే గ్యాస్ కూడా అవసరం ఉండదు. దీనివల్ల ఇంటిపైన కరెంటు తయారు చేసుకోవచ్చు. వేడి ఎక్కువ ఉంటే ఏసీ పెట్టుకోవచ్చు. డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదో నా అవసరం కోసం చెప్పానని అనుకుంటున్నారే కానీ, మీలో చైతన్యం రావడం లేదు. కరెంటు బిల్లు కట్టకుండా మీరు పది రూపాయలు మిగుల్చుకోవాలనేదే నా ఆకాంక్ష’’ అంటూ సీఎం చెప్పుకొచ్చారు. పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద సోలార్ ప్యానెల్స్ అమర్చుకుని విద్యుత్ ఉత్పత్తి చేసేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
కుటుంబానికి ఇల్లు... రాష్ట్రానికి రాజధాని
ఇక సమావేశంలో రాజధాని అమరావతితోపాటు పలు అంశాలపై సీఎం ప్రసంగించారు. “గత పాలనలో రాజధాని లేకుండా చేశారు. రాష్ట్రం పేరు చెబితే ఇతర ప్రాంతాల్లో చులకన అయ్యేలా చేశారు. అద్భుతమైన నగరం ఉండాలనే అమరావతిని నిర్మిస్తున్నాం. రాజధానిపై గత పాలకులు నాలుక మడతపెట్టారు. మూడు ముక్కలాట ఆడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. దేశంలో ఏ రాష్ట్రమైనా తమ రాజధాని నగరాలను ఘనంగా చెప్పుకుంటున్నాయి. గత పాలనలో రాజధానే లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆగస్టు 13 తేదీన రాజధానిలోని ప్రధాన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అవుతుంది.’’ అని మఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వేగంగా జరుగుతున్న పనులు చూసి రాజధానిపై మళ్లీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
వాళ్లది బ్యాడ్ ఇమేజ్... మాది బ్రాండ్ ఇమేజ్
మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో చెబుతున్నారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా...? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా..? కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరం. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును తీసేసింది. ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింది. కూటమి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నాం. వాళ్లది బ్యాడ్ ఇమేజ్... మాది బ్రాండ్ ఇమేజ్. కోర్టు కేసులు వేసి అడ్డుకున్నా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా... మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తూ ప్రజలను వేధిస్తున్నారు. జెన్-జీ యువత అభివృద్ధిని కోరుకుంటోంది. కానీ కొందరు గొడ్డలి జనరేషన్ కు చెందిన వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వీళ్లది గొడ్డలి జె. అభివృద్ధిని అడ్డుకునేలా చేసే అరాచకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. కఠిన చర్యలకు వెనుకాడం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
కుట్రదారులను దూరంపెట్టాలి
“గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. యాక్సిడెంట్ చేస్తే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. కానీ ఆధారాలు తారుమారు చేసేసి, వ్యక్తులను మార్చేసి కుట్రలు చేసి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నించారు. 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటని మాట్లాడతారు. ఇదెక్కడి విడ్డూరం... ఇలాంటి వారిని ఏమనాలి? పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించి వెకిలి చేష్టలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడే మహిళా పోలీసు అధికారుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారు.
మహిళా పోలీసుల అధికారులను కూడా గొడ్డలి గ్యాంగ్ వేధిస్తోంది. పొగాకు రైతులను పలకరించేందుకు వెళ్లి అక్కడ అరాచకం సృష్టించారు. రౌడీయిజం చేస్తూ రప్పా రప్పా అంటూ రోడ్డుపైకి వచ్చి అడ్డం పడుతున్నారు. బ్రాందీ షాపుల్లో మద్యం తాగి బట్టలు విప్పి అరాచకం సృష్టిస్తున్నారు. గంజాయి బ్యాచ్ అంతా పొగాకు నాశనం చేశారు. రైతులు అవేదన వారికి పట్టడం లేదు. ఓ దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి వీళ్ల కుమ్ములాటలో గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు. సభ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని రాజకీయ పార్టీలు అసభ్యంగా, బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయి. గత పాలనలో అంతా అరాచకం రాజ్యం ఏలింది. ఇప్పుడు ప్రజలకు ఆ పరిస్థితి లేదు. కుట్రలను ప్రజలు గమనించాలి... కుట్రదారులను దూరం పెట్టాలి. ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలి.”అని సీఎం చంద్రబాబు కోరారు.
