సింహాచలానికి చంద్రబాబు వెళ్లకుండా మంచిపని చేశారా?
ఏదైనా విపత్తు విరుచుకుపడితే వెంటనే.. అక్కడకు వెళ్లేందుకు ఆసక్తిని చూపుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
By: Tupaki Desk | 1 May 2025 4:01 AMఏదైనా విపత్తు విరుచుకుపడితే వెంటనే.. అక్కడకు వెళ్లేందుకు ఆసక్తిని చూపుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఏదైనా కష్టం వచ్చిందన్న అభిప్రాయం కలిగినంతనే.. బాధితులకు అండగా నిలుస్తానన్న భరోసాను కల్పించేందుకు వీలుగా చంద్రబాబు చర్యలు ఉంటాయి. అయితే.. తాజాగా చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో నిర్మించిన గోడ కూలటం.. ఏడుగురు దుర్మరం పాలు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల్ని పరామర్శించేందుకు వీలుగా చంద్రబాబు విశాఖ పర్యటన ఉంటుందని అందరూ ఆశించారు.
అందుకు భిన్నంగా ఆయన విశాఖకు వెళ్లలేదు. ఆ మాటకు వస్తే.. పార్టీ సీనియర్ నేత.. తనకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి సైతం హాజరుకాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన ఈ వివాహ మహోత్సవానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. తన తీరుకు భిన్నంగా వ్యవహరించిన చంద్రబాబు..ఈ రెండు ప్రోగ్రామ్ లకు హాజరు కాకుండా మంచి పని చేసినట్లుగా చెబుతున్నారు.
సింహాచల దుర్ఘటన వేళ.. చంద్రబాబు విశాఖకు వచ్చి.. ఆ తర్వాత ఆలయం వద్దకు వచ్చి ఉంటే.. ఇబ్బందికరంగా ఉండేది. భక్తులు అవస్తల పాలయ్యేవారు. ముఖ్యమంత్రికి ఉండే భద్రతా ఏర్పాట్లు భక్తులకు కష్టాన్ని మిగిల్చేవి. అందులోనూ చందనోత్సవ కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు వచ్చే సందర్భంగా తాను అక్కడికి వెళ్లటం ద్వారా.. భక్తులను మరింత ఇబ్బంది పెట్టినట్లు అవుతుందన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు తన విశాఖ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.
తీవ్ర విషాదం చోటు చేసుకున్న వేళ.. పార్టీ సీనియర్ నేత ఇంట్లోతమనుతాము జరిగే వివాహ వేడుకకు హాజరై ఉంటే.. చంద్రబాబు మరిన్ని విమర్శల్ని మూటకట్టుకునే వారు. ఇందుకు భిన్నంగా తాజా దుర్ఘటన వేళ.. అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకొని. సింహాచలం దుర్ఘటనపై సమీక్షను నిర్వహించటం గమనార్హం.ఒక విధంగా ఇదే మంచి పద్దతిగా చెప్పక తప్పదు.
బాధితులకు అందాల్సిన సహాయక చర్యలతో పాటు.. దుర్ఘటన తర్వాత చోటు చేసుకునే ఘటనల్ని హ్యాండిల్ చేసేందుకు అవసరమైన యంత్రాన్ని పెద్ద ఎత్తున మొహరించటం లాంటివి తన పర్యటన కారణంగా ఆలస్యం చేస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకునే విశాఖ పరామర్శకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా.. తన అలవాటుకు భిన్నంగా బయటకు రాకుండా.. ఒకే చోట ఉండి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సహాయక చర్యల మీద సమీక్షించటంతో పనులు వేగంగా జరిగినట్లుగా చెబుతున్నారు.