మండలి పై మౌనం.. బాబు బాంబు పేలుస్తారా.. ?
శాసన మండలిలో ఖాళీ అయిన.. రెండు స్థానాలను భర్తీ చేసే విషయంపై టీడీపీ అధినేత, సీఎం చంద్ర బాబు మౌనంగా ఉన్నారు.
By: Garuda Media | 31 July 2026 10:00 AM ISTశాసన మండలిలో ఖాళీ అయిన.. రెండు స్థానాలను భర్తీ చేసే విషయంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఈ రెండు సీట్లు కూడా గవర్నర్ కోటాలో భర్తీ చేసేవే కావడం గమనార్హం. ప్రస్తుతం కూటమి సర్కారుకు గవర్నర్ అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో ప్రబుత్వం తీసుకునే నిర్ణయానికి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. దీంతో ఎవరిని ఎంపిక చేసినా ఇట్టే వారు మండలిలో కూర్చుంటారు.
దీంతో నాయకులు మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. గతంలో తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక వివాదం అయింది. సుప్రీంకోర్టు వరకు సాగింది. అయితే.. ఇలాంటి వివాదాలు ఏపీలో కనిపించడం లేదు. దీంతో బాబు నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉంది. ఇది నాయకుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. అయితే.. తాజాగా సీనియర్ నాయకులతో సచివాలయంలో చంద్రబాబు భేటీ అయినా.. ఈ విషయంపై ఆయన ఎక్కడా స్పందించలేదు.
పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఇది మరింతగా నాయకుల్లో టెన్షన్ పెంచుతోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నిక ల సమయంలోనూ టీడీపీ కోటాలో ఎంపిక చేసేవారి పేర్లను ఇంతే గోప్యంగా ఉంచారు. ఫలితంగా ఆశలు పెట్టుకున్నవారు.. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎంపిక ప్రక్రియ అయిపోయిన తర్వాత..ఆశలు పెట్టుకున్న అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా బాబు బాంబు పేలుస్తారా? అనేది చర్చకు దారితీసింది.
అయితే.. అలా వద్దని.. సడెన్‌గా పేర్లను వెల్లడిస్తే.. కేడర్‌లో చులకన అవుతున్నామని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, అయితే.. ఆ నిర్ణయమేదో సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే.. కేడర్‌ను సంతృప్తి పరిచేందుకు.. తమ ఫ్యామిలీలను సంతృప్త పరిచేందుకు కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఈ విషయంపై టీడీపీలో చర్చ సాగుతోంది. కొందరు నాయకులు వస్తుందో రాదో అన్న బెంగతో తరచుగా ఫోన్లు కూడా చేస్తున్నారు. మరి చంద్రబాబు ఎ వరిని కరుణిస్తారో చూడాలి. ఏదేమైనా సడెన్‌గా కాకుండా ముందుగానే ప్రకటించాలని నాయకులు కోరుతున్నారు.
