వైసీపీతో మిలాఖత్.. పోలీసులపై సీఎం సీరియస్? ఎక్కడ.. ఎవరు!!
ప్రతిపక్ష వైసీపీ నేతలతో కొందరు పోలీసులు అంటకాగుతున్నారని, ప్రభుత్వ మనోభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందుతున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 12 Aug 2026 11:52 PM ISTప్రతిపక్ష వైసీపీ నేతలతో కొందరు పోలీసులు అంటకాగుతున్నారని, ప్రభుత్వ మనోభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందుతున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనల్లో వైసీపీ నేతలు, పోలీసు అధికారుల మధ్య అవగాహన బయటపడిందని చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. వైసీపీ నేతలతో ఏ స్థాయిలో కూడా వేదికలు పంచుకోకూడదని తన పార్టీ నేతలకు ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పుడు ప్రభుత్వంలోని అధికారులు, ఉద్యోగులు కూడా అదేవిధంగా వ్యవహరించాలని సీఎం భావిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో పోలీసు శాఖ పనితీరుపై తొలి నుంచి విస్తృత చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులుపెట్టినా పట్టించుకోరా? సాక్ష్యాత్తూ ఉప ముఖ్యమంత్రి అయిన తన కుటుంబ సభ్యులనే దారుణంగా తిడుతున్నారంటూ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హోంశాఖపై ప్రభుత్వానికి అదుపు లేదనే భావన వ్యక్తమైందని అంటున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం పవన్ ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ తన చేతిలో లేదని, తానే హోంమంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉండేదని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీంతో ప్రభుత్వం చెప్పిన పనులను పోలీసులు చేయడం లేదా? అన్న చర్చ మొదలైందని అంటున్నారు. ఇటువంటి సమయంలోనే వైసీపీ నాయకులకు సహకరించేలా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని దిగువస్థాయి నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారంతోపాటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి సహకరిస్తున్నాడని ఆయా పోలీసుస్టేషన్లలో సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. ఇదే సమయంలో తాడిపత్రిలో విపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సహకరించేలా అక్కడి పోలీసుల ప్రవర్తన ఉందని సీఎం చంద్రబాబుకి ఫిర్యాదులు అందినట్లు చెబుతున్నారు.
పలాస ఉదంతంలో రోడ్డు ప్రమాదంలో నిందితుడిని తప్పించడానికి అక్కడి పోలీసు అధికారులు సహకరించారని ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. అదేవిధంగా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానితో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడితే శాంతిభద్రతల సమస్య ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ ఇటీవల ఆయన తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టేలా అక్కడి పోలీసులు సహకరించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వరుస పరిణామాలపై ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి గురి అయ్యారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు ఏం చేస్తున్నారనే అంశంపై నిఘా కొరవడిందని సీఎం అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సీఎం భావిస్తున్నారని, భవిష్యత్తులో ఈ పరిస్థితిని నివారించేలా కఠినంగా వ్యవహరించాలని హోం శాఖను సీఎం ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై బదిలీ వేటువేయడంతోపాటు వైసీపీ నేతలతో సాన్నిహిత్యం ఉన్న అధికారుల జాబితాను తెప్పించుకుని అందరినీ వీఆర్ కు పంపేలా నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు వీఆర్ లో ఉండగా, ప్రస్తుతం ఫిర్యాదులు ఉన్న వారు అందరినీ రిజర్వులోకి పంపాలని సీఎం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
