Begin typing your search above and press return to search.

జగన్ కి అరెస్ట్ కి మధ్య గ్యాప్ ఎంతో చెప్పిన బాబు !

ఈ నేపథ్యంలో తనను మూడేళ్ళ క్రితం అరెస్టు చేసిన వైనం మీద చంద్రబాబు కూడా మరోసారి బహిరంగ వేదిక మీదనే రియాక్ట్ అయ్యారు.

By:  Satya P   |   9 Sept 2026 9:00 PM IST
జగన్ కి అరెస్ట్ కి మధ్య గ్యాప్ ఎంతో చెప్పిన బాబు !
X

ఏపీ రాజకీయాలు గతానికి కంటే ఇపుడు మారిపోయాయి. ఎవరో అన్నారని కాదు కానీ రెండు పార్టీలు రెండు కుటుంబాలు మధ్యనే ఏపీ రాజకీయం తిరుగుతోంది. ఇది దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి సాగుతున్న వ్యవహారంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అనేక మార్పులు వచ్చ్చాయి. వివిధ రాష్ట్రాలలో రాజకీయ స్వరూపం వేరుగా ఉంది. అక్కడ ఈ తరహా రాజకీయం అయితే లేదు. కానీ ఒక్క ఏపీలోనే ఈ రకమైన రాజకీయం సాగుతోంది. ఇది ప్రతీకార రాజకీయాలకు కూడా దారి తీస్తోంది. ఇక సెప్టెంబర్ 9 అంటే మూడేళ్ళ ముందు వరకూ ఆ డేట్ కి ఏ రకమైన ప్రాధాన్యత లేదు కానీ 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడంతో దానికి రాజకీయంగా విశేష ప్రాధాన్యత వచ్చింది. ఈ రోజుకి మూడేళ్ళు గడచినా టీడీపీ దానిని మరచిపోలేకపోతోంది. బ్లాక్ డేగా పాటిస్తోంది. అకారణంగా టీడీపీ అధినేత బాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అన్నది టీడీపీ నేతల వాదనగా ఉంది. అంతే కాదు ప్రతీకార రాజకీయాలకు వైసీపీ నేతలు తెర తీశారు అని కూడా మండిపడుతున్నారు.

ఆనాటి అరెస్టు మీద :

ఈ నేపథ్యంలో తనను మూడేళ్ళ క్రితం అరెస్టు చేసిన వైనం మీద చంద్రబాబు కూడా మరోసారి బహిరంగ వేదిక మీదనే రియాక్ట్ అయ్యారు. ఆయన కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేటలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ గతాన్ని ఒకసారి నెమరేసుకున్నారు. నంద్యాలలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన సమయంలో మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 9న అర్ధరాత్రి వచ్చి తనను అరెస్టు చేస్తామని చెప్పారని చంద్రబాబు అప్పటి పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి పూట తనను అరెస్టు చేశారని తెలిపారు. తనపై ఉన్న ఆరోపణలు ఏమిటని ప్రశ్నిస్తే అరెస్టు చేసిన తర్వాత చెబుతామని చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన తనను ఉన్నపళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారని పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఆ సంఘటన జరిగిందని వ్యాఖ్యానించారు.

ఒక్క నిముషం చాలదా :

ఇక జగన్ ని అరెస్టు గురించి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇదే సభలో ప్రస్తావించడం విశేషం. నిజంగా జగన్ ని అరెస్టు చేయాలని ప్రతీకారం తీర్చుకోవాలనుకోవాలంటే తనకు నిమిషం చాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే జగన్ ని అరెస్ట్ చేయాలని అనుకుంటే అది చిటికలో పని అని బాబు చెప్పకనే చెప్పారు అన్న మాట. వైసీపీ అధినేతకు అరెస్టుకు మధ్య గ్యాప్ జస్ట్ ఒక్క నిముషం మాత్రమే సుమా అన్న సందేశాన్ని వైసీపీ నేతలకు చంద్రబాబు పంపించారని అంటున్నారు. దీంతో జగన్ మీద అరెస్టు కత్తి అన్నది ఇప్పటికీ వేలాడుతోంది అన్న భావన అయితే కలుగుతోంది. గతంలోనూ జగన్ అరెస్టు మీద ఎన్నో రకాల కధనాలు వచ్చాయి కానీ ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరెస్టు చేయాలనుకుంటే ఎంత సేపు అని చెప్పడం ద్వారా వైసీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చకు తావిచ్చారు అని అంటున్నారు.

అయినా సరే అంటూ :

అయితే జగన్ అరెస్ట్ విషయంలో ఎంత సేపు అన్నట్లుగా మాట్లాడిన చంద్రబాబే అయినా కానీ అంటూ మరో మాట కూడా చెప్పారు. తాను ప్రతీకార రాజకీయాల కంటే సహనంతో వ్యవహరిస్తాను అని చెప్పారు. తనను మెత్తగా సున్నితంగా ఉంటారు అని ఎవరు విమర్శించినా కూడా తాను మాత్రం రాష్ట్ర అభివృద్ధి గురించే ఎక్కువగా ఆలోచిస్తాను అని అన్నారు. తాను చేసే ప్రతీ పనిలో ప్రజల బాగు మాత్రమే చూస్తాను అని అన్నారు. అందుకే తాను వైసీపీ తరహాలో ఆలోచన చేసేది ఉండదని స్పష్టం చేశారు. అంటే జగన్ అరెస్ట్ విషయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం తానుగా ఎలాంటి చర్యలు తీసుకోదని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మరి జగన్ అరెస్టు అన్నది ఎప్పటికీ ఉండదా అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. సో ఆ విధంగా ఏమైనా జరుగుతుందో తెలియదు కానీ ఏపీ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అరెస్టు వంటి పెద్ద యాక్షన్ కి దిగదని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల వైసీపీ బూమరాంగ్ అయిన సంగతి కూడా కూటమి గమనంలోకి తీసుకుని ఉంటుందని అంటున్నారు.