భారీ చిట్టాతో ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంపై చర్చ, వేమిరెడ్డికి చాన్స్?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. రెండు తుఫాన్లతో ఏపీకి జరిగిన రూ.7 వేల కోట్ల నష్టానికి పరిహారం కోరడంతో పాటు, రాష్ట్రానికి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి కల్పించే అంశంపై కూడా చర్చ జరగవచ్చని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Political Desk | 16 Nov 2026 3:54 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నప్పటికీ, ఆ కార్యక్రమానికి ముందు వెనుక పలువురు కేంద్ర మంత్రులను కలిసే షెడ్యూల్ రెడీ అవ్వడమే రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది. సహజంగా సీఎం ఢిల్లీ వస్తారంటేనే చాలా పెద్ద లిస్టు బయటకు తీస్తారని, ఈ సారి ఆయన చిట్టాలో ఏయే అంశాలు ఉన్నాయనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన మిత్రుడిగా మెలుగుతున్న చంద్రబాబు రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు, ప్రాజెక్టులు తీసుకుపోతున్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి ఉన్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ఎన్డీఏ పాలనలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను మించి ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఏపీకి అదనపు ప్రయోజనాలు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన తాజా ఢిల్లీ పర్యటన విశేషాలపై సర్వాత్రా ఆసక్తి నెలకొందని అంటున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ఢిల్లీకి పయనమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ మొత్తం బిజీబిజీగా ఉందని చెబుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కోసం వన్ జనపథ్ కి సీఎం వెళ్లనున్నారని చెబుతున్నారు. అక్కడే పలువురుకేంద్ర పెద్దలతో ఆయన భేటీ అవుతారని అంటున్నారు. ఉదయం 12.10 నుంచి సాయంత్రం 6.50 వరకు సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. దీంతో సీఎం ఏయే కేంద్ర మంత్రులను కలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ముఖ్యంగా ఇటీవల రెండు తుఫాన్లతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ తుపాన్ల కారణంగా సుమారు 7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. కేంద్ర బృందం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని విరివిగా కేటాయించాలని సీఎం కేంద్రాన్నికోరుతున్నారు. అదే సమయంలో కీలక రాజకీయ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చేనెల ఆరంభంలో పార్లమెంటు శీతా కాల సమావేశాలు జరగనున్నాయి. వీటికి ముందు కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత పెండింగులో ఉన్న రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంపైనా సీఎంతో కేంద్ర పెద్దలు చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో సీఎం టూర్ పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రానికి మరో మంత్రి పదవి
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో నెల్లూరుకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన సతీమణికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడో ఒక చోట మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్రంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అవకాశం ఇవ్వలేకపోయారని అంటున్నారు. కేంద్రంలో కూడా మూడు మంత్రి పదవులు ఇవ్వగా రెండు అగ్రవర్ణాలకు కేటాయించడం వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు వెనక్కి వెళ్లిపోయిందని చెబుతున్నారు. అయితే వేమిరెడ్డి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను మంత్రిని చేస్తే కేంద్రంలో మరిన్ని నిధులు సమీకరణకు ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. తాజా పర్యటనలో ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
