శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్...బాబు కొత్త ఆలోచన
ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అందరి కంటే ఎక్కువగా వాడుకుంటారు. ఈ దేశంలో అలా వాడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఎవరు వాడినా ఒక స్థాయిలోనే వాడుతారు.
By: Satya P | 3 Dec 2025 9:29 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అందరి కంటే ఎక్కువగా వాడుకుంటారు. ఈ దేశంలో అలా వాడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఎవరు వాడినా ఒక స్థాయిలోనే వాడుతారు. కానీ ఏ టూ జెడ్ దాకా టెక్నాలజీని వాడేది మాత్రం ఏపీనే. ఇప్పటికే అనేక విప్లవాత్మక నిర్ణయాల విషయంలో టెక్నాలజీని ముందున పెడుతున్న చంద్రబాబు తాజాగా మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ గా ఆర్టీజీఎస్ ని తీర్చిదిద్దడం. దీని వల్ల ఆర్టీజీఎస్ మరింత విస్తృతంగా సేవలు చేసేందుకు వీలు కలుగుతుందని తద్వారా వేగవంతమైన కమ్యూనికేషన్ అందుబాటులోకి రావడమే కాదు ఏ శాఖలో ఏమి జరిగిన రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిష్కరించవచ్చునను భావిస్తున్నారు.
నెలాఖరులోగానే :
ఈ విషయం మీద ముఖ్యమంత్రి గట్టి పట్టుదల మీద ఉన్నారు. అందుకే ఆయన ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని అధికారులకు స్పష్టం చేస్తూనే ఈ నెలాఖరు లోగా ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మొత్తం ఏపీని కంట్రోల్ చేసే విధంగా ఈ టెక్నాలజీ ఉండబోతోంది. దీనికి సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో చంద్రబాబుసమీక్ష నిర్వహించారు.
మెరుగ్గా పౌర సేవలు :
ఇక ప్రజలలో పాజిటివ్ నెస్ పెరిగేలా వారికి మరింత మెరుగ్గా పౌరసేవలు అందించాలని బాబు అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని ఆదేశించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీ పడవద్దని కూడా ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
డెడ్ లైన్ అదే :
ఇక ఈ ఏడాది ముగిసేలోగా అంటే డిసెంబరు నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన 794 సర్వీసులు వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ప్రతీ నెలా జీఎస్డీపీ సహా ఎకనమిక్ ఇండికేటర్లను పరిశీలించనున్నట్టుగా కూడా బాబు చెప్పడం విశేషం. అదే విధంగా కేంద్రానికి పంపే నివేదికలు కూడా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల ఆధారంగానే ఉంటాయని ఆయన చెప్పారు దాంతో పాటుగా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సామర్ధ్యాలు పెంచుకోవాలని సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగానే పనులు చేపట్టాలని బాబు చెప్పడ విశేషం.
