చంద్రబాబు సంకేతాలు.. రూ.500 నోట్లు రద్దు అయ్యే చాన్స్!
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.500 నోటును కూడా రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. రోజువారీ లావాదేవీలకు రూ.100, రూ.200 నోట్లు సరిపోతాయని, మిగతా లావాదేవీలను డిజిటల్ విధానంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
By: Tupaki Political Desk | 9 Nov 2026 3:59 PM ISTపెద్ద నోట్ల రద్దు, డిజిటల్ కరెన్సీ ప్రమోషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అంతం చేయడానికి, నల్లధనానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి రూ. 500 నోట్లను కూడా పూర్తిగా రద్దు చేయాలని సంచలన ప్రతిపాదన చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దుపై తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. దేశంలో అవినీతి అంతం అవ్వాలంటే రూ.500, రూ.1000, రూ.2000 వంటి పెద్ద నోట్లు ఉండకూడదని చంద్రబాబు గత 12 ఏళ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000, రూ.2000 నోట్లు రద్దు చేయగా, ఇప్పుడు రూ.500 నోటును ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇలా చేస్తే అవినీతికి చెక్ చెప్పొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ధనప్రవాహం ఎక్కువ కావడం, చిన్నచిన్న పదవులకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజల రోజువారీ లావాదేవీలకు రూ. 100, రూ. 200 నోట్లు మాత్రమే సరిపోతాయని, అంతకంటే పెద్ద నోట్ల అవసరం లేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. పెద్ద నోట్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, 100 శాతం డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేయడమే ఆర్థిక పారదర్శకతకు ఏకైక మార్గమని ఆయన బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. సంపద సృష్టించాలన్నా, పేదరికం అంతం అవ్వాలన్నా టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సీఎం సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కరెన్సీలో పెద్ద నోటు రూ.500 మాత్రమే. దీనిని ఉపసంహరించి, ఆ మేరకు డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలన్న సీఎం సూచనపై హాట్ డిబేట్ జరుగుతోంది.
భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేసిన రాజకీయ నాయకుల్లో సీఎం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలని ఆయన తొలిసారి ప్రతిపాదించారు. ఆ తర్వాత, దేశంలో సమాంతరంగా నడుస్తున్న నల్లధన ఆర్థిక వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించాలంటే పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గమని పేర్కొంటూ 2016 అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన కొన్ని రోజులకే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, దేశాన్ని డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించే బాధ్యతను చంద్రబాబు భుజాలకెత్తుకున్నారు. ఈ క్రమంలో కేంద్రం నియమించిన 13 మంది ముఖ్యమంత్రుల హైపవర్ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో డిజిటల్ ఇండియా కోసం ఆయన నీతి ఆయోగ్‌కు సమర్పించిన ప్రతిపాదనలు నేటికీ ఎంతో కీలకంగా చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు లేని సాధారణ, పేద ప్రజలు కూడా డిజిటల్ లావాదేవీలు చేసుకునేలా బయోమెట్రిక్ ఆధారిత 'ఆధార్ పే' విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. అలాగే ఆన్లైన్ లేదా కార్డ్ చెల్లింపులు చేసే వినియోగదారులకు, వ్యాపారులకు పన్ను మినహాయింపులు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా డిజిటల్ కరెన్సీని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని సూచించారు.
రూ.2000 నోటుపై తీవ్ర అభ్యంతరం
2016 నోట్ల రద్దు అనంతరం కేంద్రం రూ. 2000 నోటును ప్రవేశపెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రూ. 1000 నోటును రద్దు చేసి, దానికంటే పెద్దదైన రూ. 2000 నోటును తీసుకురావడం వల్ల నల్లధనం దాచుకునే వారికి మరింత సులువు అవుతుందని 2018లో అసెంబ్లీ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నోటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తదనంతర కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. కాగా, ప్రస్తుతం రూ.500 నోటును కూడా రద్దు చేయాలని సీఎం ప్రతిపాదించడం వెనుక రాజకీయాల్లో అవినీతిని అరికట్టే ఎన్నికల సంస్కరణ ఉందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి మారాలంటే రూ. 500 నోటు చలామణిలో ఉండకూడదని 2025లో నిర్వహించిన మహానాడు తీర్మానం చేశారు. రాజకీయ పార్టీలు సేకరించే ప్రతి రూపాయి విరాళం డిజిటల్ రూపంలోనే జరగాలని, నగదు విరాళాలు పూర్తిగా నిషేధించాలనే సంచలన ప్రతిపాదన చేశారు.
