Begin typing your search above and press return to search.

బీజేపీ అధ్యక్షుల ఎంపిక.. తెర వెనుక చక్రం తిప్పిన చంద్రబాబు?

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పనిచేసిన చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యం ఉంది.

By:  Tupaki Desk   |   1 July 2025 4:26 PM IST
బీజేపీ అధ్యక్షుల ఎంపిక.. తెర వెనుక చక్రం తిప్పిన చంద్రబాబు?
X

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా చోటుచేసుకునే ప్రతి మార్పు వెనుక ఉంటారని చర్చ జరుగుతూ ఉంటుంది. ఏదో రూపంలో చంద్రబాబును తీసుకువచ్చి తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నిపార్టీల నేతలు చూస్తుంటారు. దీనికి తాజా ఉదాహరణే రెండు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకంలో చంద్రబాబు పాత్ర ఉందన్న ఆరోపణలు అని అంటున్నారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పనిచేసిన చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యం ఉంది. ఆయన ప్రభావంతోనే రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మార్పులు, చేర్పులు ఉంటాయని విశ్లేషకుల నుంచి రాజకీయ నాయకుల వరకు అభిప్రాయపడుతుంటారు. తెలంగాణ రాజకీయాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోయినా ఆ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న ప్రతిపార్టీ ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు పేరును ప్రస్తావనకు తీసుకువస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ తన మనుగడు కోసం చంద్రబాబునే టార్గెట్ చేస్తుంటుంది. బీఆర్ఎస్ రాజకీయంగా మంచి స్థానంలో ఉండాలంటే చంద్రబాబును బూచిగా చూపుతుంటుందని అంటుంటారు. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుల నియామకంలో చంద్రబాబు పేరును మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనప్పటికీ.. తెరవెనుక చంద్రబాబు ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగానే ఈ ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ఏర్పాటుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత కృషి చేశారో.. బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి కూడా అంతే పకడ్బందీగా పనిచేశారంటారు. వాస్తవానికి చంద్రబాబు, పురందేశ్వరి దగ్గర బంధువులు. ఈ ఇద్దరి మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాల రాజకీయ వైరం కొనసాగింది. పొత్తు కుదిరిన తర్వాతే వారి కుటుంబాలు దగ్గరయ్యాయి. రాజకీయం, కుటుంబ పరంగా అంతా ఇప్పుడు సెట్ అయిందని అంటారు. అయితే పురందేశ్వరి పదవీకాలం పూర్తవడంతో కొత్తవారిని ఎన్నుకున్నారు.

పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరికి రెండో సారి కొనసాగించే అవకాశం ఉన్నా, చంద్రబాబు వల్లే ఆమెను తప్పించారని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్ల పురందేశ్వరిని తప్పించారని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో పీవీఎన్ మాధవ్ నియామకం వెనుక కూడా చంద్రబాబు పాత్ర ఉందని అంటున్నారు. కూటమిలో చక్కని సమన్వయం కోసం మాధవ్ వంటి మృదు స్వభావి ఉండాలని చంద్రబాబు భావించారని, అందుకే ఆయన సూచన ప్రకారం బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంటున్నారు. నిజానికి చంద్రబాబు పాత్ర ఉన్నా, లేకపోయినా అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు చంద్రబాబు పేరును ప్రస్తావనకు తీసుకువస్తుండటమే ఆసక్తి రేపుతోంది.

మరోవైపు తెలంగాణలోనూ బీజేపీ అధ్యక్ష నియామకంలో చంద్రబాబు ప్రభావం కనిపిస్తోందని అక్కడి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉన్నా, తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు అసలు కలిసి పనిచేయడం లేదు. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుకోడానికి ఇప్పటికీ చంద్రబాబును తెలంగాణకు విలన్ గానే ప్రచారం చేస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లింకు పెడుతూనే బీజేపీతోనూ చేతులు కలిపి చంద్రబాబు తెలంగాణకు నష్టం చేస్తున్నారని చెబుతోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమపై చంద్రబాబు నీడ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారని అంటున్నారు. చంద్రబాబు సైతం తనకు తెలంగాణ రాజకీయాలతో అనవసరమన్నట్లే ఉంటున్నారు. కానీ, తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక వెనుక చంద్రబాబు ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని డీకే అరుణ, ఈటల రాజేందర్ వంటి సీనియర్లు ఆశించినా, వారు చంద్రబాబు వ్యతిరేకులు అన్న కారణంగానే పదవి ఇవ్వలేదని అంటోంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకం కూడా పార్టీ నియమావళి ప్రకారమే జరిగిందని కమలం నేతలు వివరణ ఇస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో ఎలాంటి కదలిక వచ్చినా, వెనుక చంద్రబాబు పేరు వినిపించడమే విశేషంగా చెబుతున్నారు.