బనకచర్లపై బాబు చర్చ.. ఉత్తమ్ అభ్యంతరం.. ఆ తర్వాతేమైంది?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు అంశాలపై చర్చలు జరిపేందుకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన చర్చకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
By: Tupaki Desk | 17 July 2025 10:17 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు అంశాలపై చర్చలు జరిపేందుకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన చర్చకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులకు తాను ఎప్పటికి అభ్యంతరం చెప్పనని.. అడ్డుపడబోనని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేయటం ఒక అంశంగా చెప్పాలి.
అదే సమయంలో పోలవరం - బనకచర్ల పథకం గురించి చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన చంద్రబాబు తీరును తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిఅభ్యంతరం చెప్పారు. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని.. తన వాదనను సున్నితంగా వినిపించినట్లు తెలిసింది. గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు.. కేటాయింపుల మేరకే.. సముద్రంలో వేస్టుగా పోయే వరద జలాల్ని మాత్రమే వాడుకునేలా బనకచర్ల ప్రాజెక్టును రూపొందించినట్లుగా వివరణ ఇవ్వటం గమనార్హం.
‘బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ కోసం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టు మీద ఎక్కడ మాట్లాడేందుకైనా సిద్ధం. నాకు భేషజాలు లేవు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను ఎప్పటికి అడ్డుకోం’ అని స్పష్టం చేసతూ.. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి.. తెలంగాణలో వ్యక్తమవుతున్న పలు సందేహాలకు సమాధానాలు చెప్పే అంశాలకు సంబంధించిన ప్రతులను తెలంగాణ సీఎం రేవంత్ కు.. మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పంపినట్లుగా తెలిసింది. ఏమైనా..తాజా భేటీలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.
