Begin typing your search above and press return to search.

వారంలో 2 అరుదైన పొలిటికల్ కాంబోలు.. తెలుగోళ్లంతా హ్యాపీ

పదేళ్లు నాన్ స్టాప్ అధికారంతో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయానికి గురికావటం.. ఆ తర్వాత నుంచి రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు.

By:  Garuda Media   |   23 Nov 2025 2:00 PM IST
వారంలో 2 అరుదైన పొలిటికల్ కాంబోలు.. తెలుగోళ్లంతా హ్యాపీ
X

అరుదైన కాంబోలు ఒక వారం వ్యవధిలో చోటు చేసుకోవటం.. అందునా అది పొలిటికల్ కాంబోలు కావటం ఈ వీక్ ప్రత్యేకతగా చెప్పాలి. ఒక కాంబో వీక్ మొదట్లో చోటు చేసుకోగా.. రెండో కాంబో వీకెండ్ వేళ జరగటం కాకతాళీయమే అయినా.. ఈ రెండు పొలిటికల్ కాంబోలతో తెలుగోళ్లంతా హ్యాపీగా ఫీలయ్యే పరిస్థితిగా చెప్పాలి. మీడియా మొఘల్ రామోజీ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన రామోజీ పురస్కారాల కార్యక్రమం గత ఆదివారం సాయంత్రం వేళ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీ వేదికగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు. ఒకప్పటి గురుశిష్యులు.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం హోదాలో రావటం.. పక్కపక్కనే కూర్చోవటం.. ఇరువురు అప్యాయంగా పలుకరించుకోవటం.. తన స్థాయికి.. హోదాకు తగ్గట్లుగా రేవంత్ బిహేవ్ చేసిన వైనం.. దాన్ని అంతే పెద్దరికంగా ఎంజాయ్ చేసిన చంద్రబాబు తీరు.. రెండు రాష్ట్రాల్లోని ఆయా అధినేతల అభిమానుల్ని.. వారు ప్రాతినిధ్యం వహించే పార్టీ క్యాడర్ ను ఖుషీ చేశాయని చెప్పాలి.

ఒకప్పటి గురువుకు ఏ మాత్రం తీసిపోకుండా శిష్యుడు సైతం సీఎం కావటం.. ఒకప్పటి గురుశిష్యులిద్దరు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ..ఒక ప్రోగ్రాంకు హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. నాటి గురువు పక్కన కూర్చొని కాలు మీద కాలు వేసుకొన్న రేవంత్ తీరును ఎవరూ తప్పు పట్టలేదు. అంతేకాదు.. ఒకప్పటి తన శిష్యుడి స్థాయిని చంద్రబాబుఎంజాయ్ చేసిన తీరు.. ఒక సందర్భంలో రేవంత్ తో బాబు చతుర్లు టీవీలో కనిపించి అందరి ముఖాల్లో నవ్వులు విరబూసేలా చేశాయి.

ఇదిలా ఉంటే వీకెండ్ వేళ.. బెంగళూరులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ కీలక నేత.. గులాబీ బాస్ ప్రభుత్వంలో డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారని చెప్పుకునే కేటీఆర్ ఇద్దరూ ఒక ప్రైవేటు ఫంక్షన్ కు హాజరు కావటం.. ఇరువురు పక్కపక్కనే కూర్చోవటం.. మాట్లాడుకోవటం అందరిని ఆకర్షించేలా చేశాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తీరే విషయంలో కేసీఆర్ అందించిన సాయం బహిరంగ రహస్యమే.

పదేళ్లు నాన్ స్టాప్ అధికారంతో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయానికి గురికావటం.. ఆ తర్వాత నుంచి రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అన్నీతానైనట్లుగా వ్యవహరించారు కేటీఆర్. అధినేత కేసీఆర్ తెర వెనుక ఉండిపోగా.. కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా విపరీతంగా శ్రమించారు. అయినప్పటికి ఆయన కోరుకున్న ఫలితం దక్కలేదు.

ఇదిలా ఉంటే.. భారీఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించటం ద్వారా ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేదన్నట్లుగా భావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా పాలించిన ఐదేళ్లు.. సంక్షేమ పథకాల వరద పారించిన ఆయన.. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే వ్యక్తిగతంగానూ.. రాజకీయంగా మిత్రత్వం ఉన్న ఈ ఇద్దరు ముఖ్యనేతలు తాజాగా కలవటం.. ఒక కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న వైనం అందరిని ఆకట్టుకునేలా చేసింది. వారం వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక పార్టీల అధినేతలు కాంబోల మాదిరి కలవటం.. నాలుగు పార్టీలకు చెందిన వారంతా హ్యాపీగా ఫీల్ కావటం ఒక విశేషం. ఏ మాటకు ఆ మాట.. ఈ వారం తెలుగు రాజకీయాల వరకు రోటీన్ కు భిన్నమైన ఇస్పెషల్ వారంగా నిలుస్తుందని చెప్పక తప్పదు.