Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్‌లో యోగాను చేర్చాలి: మోడీకి బాబు విన్న‌పం

యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా.. వివిధ దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:41 AM
ఒలింపిక్స్‌లో యోగాను చేర్చాలి: మోడీకి బాబు విన్న‌పం
X

ప్ర‌పంచ స్థాయి క్రీడలైన ఒలింపిక్స్‌లో యోగాను ఒక భాగం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీకి విజ్ఞ‌ప్తి చేశారు. విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ప్ర‌ధాని మోడీతో క‌లిసి.. యోగాస‌నాలు వేశారు. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం మాట్లాడుతూ.. యోగాను ఒలింపిక్స్‌లో భాగం చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు ప్ర‌ధాని చొర‌వ తీసుకోవాల‌ని విన్న‌వించారు.

యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా.. వివిధ దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. సెప్టెంబర్‌లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కానుండడం ఆనందంగా ఉంద‌న్నారు. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో చేర్చేలా ప్రధాని మోడీ చొరవ చూపాలని కోరుకుంటున్నానన్నారు. ప్రధానమంత్రి దార్శనికత, గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహించడం వల్ల, యోగా ఇప్పుడు ఉద్యమంగా మారిందన్నారు.

చరిత్ర సృష్టించాలన్నా.. రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోడీకే సాధ్యమ‌ని కొనియాడారు. యోగా మన జీవితంలో భాగం కావాలన్న సీఎం చంద్ర‌బాబు.. ప్రజలు ప్రతిరోజూ ఒక గంట యోగా కోసం సమయం కేటాయించాల‌ని సూచించారు. డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలు పెంచుకోవడం చాలా అవసరమ‌న్నారు. దీనికి కూడా యోగా ఉపకరిస్తుంద‌న్నారు. యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

"దేశం, ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా యోగాకు ఆమోదం లభించింది. శరీరం, మనస్సు, ఆత్మలను కలిపేందుకు యోగానే మార్గం. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.'' అని చంద్ర‌బాబు తెలిపారు. యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోడీ కారణమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించి, విశాఖకు వచ్చి యోగా డేలో పాల్గొన్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.