రీల్స్ చేయమంటారు.. చూస్తే వద్దంటారు.. ఇలా అయితే ఎలా చంద్రబాబు?
విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ కర్మయోగి వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
By: Tupaki Political Desk | 29 Sept 2026 3:39 PM ISTసోషల్ మీడియాలో రీల్స్ చూడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీల్స్ చూడటం కోసమే జనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రీల్స్ చూడటం వల్ల మైండ్, శరీరం కూడా డిస్టబ్ అవుతాయంటూ సీఎం చేసిన హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. విజయవాడలో నిర్వహించిన కర్మయోగి వర్క్ షాపులో సోషల్ మీడియా వినియోగంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు అలాంటి రీల్స్ చూడటం వల్ల శరీరం, మెదడు దెబ్బతింటుందని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ కర్మయోగి వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. దేశంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే ఎక్కువ మంది రీల్స్ చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీల్స్ చూసి సమయం వృథా చేసుకునే బదులు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేలా పనిచేయాలని హితవు పలికారు.
నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడం నిరంతరం సాగే ప్రక్రియ అంటూ సీఎం పేర్కొన్నారు. రీల్స్ బదులుగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కాగా, సోషల్ మీడియాను సానుకూల కోణంలో వాడుకునేందుకు వీలుగా ప్రభుత్వం తరఫున సరికొత్త 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ' తీసుకువస్తున్నట్లు ఇటీవల ప్రకటించగా, సీఎం పై విధంగా స్పందించడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో కూడా స్మార్ట్ ఫోన్లు వాడకంపైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడూ టెక్నాలజీ అభివృద్ధిని స్వాగతించే వారిలో ముందుండే సీఎం చంద్రబాబు ఫోన్లను పిచ్చిగా వాడటాన్నే వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.
గతంలో కూడా స్మార్టు ఫోన్లను వ్యసనంగా మార్చుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు పక్కపక్కనే లేకపోయినా ఉంటారేమో కానీ, పక్కన ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల ప్రజలకు నిద్ర కరువు అవుతోందని, దీనివల్ల ఒత్తిడికి గురవుతున్నారని, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. మొత్తానికి సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
