లోకేశ్‌తో అరుదైన ఫొటో.. చంద్రబాబు 80s మధుర జ్ఞాపకాలు!
ప్రస్తుతం సోషల్ మీడియాను 80s ట్రెండ్ కుదిపేస్తోంది. కాలంలో వెనక్కి వెళ్లి, నాటి మధుర జ్ఞాపకాలను, వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తున్న ఈ ట్రెండ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
By: Tupaki Political Desk | 11 Sept 2026 7:58 PM ISTప్రస్తుతం సోషల్ మీడియాను 80s ట్రెండ్ కుదిపేస్తోంది. కాలంలో వెనక్కి వెళ్లి, నాటి మధుర జ్ఞాపకాలను, వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తున్న ఈ ట్రెండ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖ నేతలు వరకు అందరూ ఈ ట్రెండ్‌లో భాగమవుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ఎక్కువమంది తమ ప్రస్తుత ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో 80ల నాటి స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. ఆ కాలంనాటి దుస్తులు, హెయిర్ స్టైల్స్, కలర్ టోన్స్ వచ్చేలా మార్ఫింగ్ చేయిస్తూ తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, నాస్టాల్జిక్‌గా ఉండటంతో ఈ ఏఐ మార్ఫింగ్ ఫొటోలకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న 80s వింటేజ్ లుక్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకర్షితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరిలాగే కాలానికి తగినట్లుగా ఏఐ ట్రెండ్‌ను ఫాలో అవుతూ, తన ఫొటోను 80ల నాటి స్టైల్‌లోకి మార్చుకుని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 'నా స్టైలే వేరు' అన్నట్లుగా ఏఐ మార్ఫింగ్‌ను ఆశ్రయించకుండా, సరిగ్గా అదే కాలంలో తాను నిజంగా తీసుకున్న ఒరిజనల్ ఫొటోలను ఎక్స్ లో ట్వీట్ చేశారు. వీటిలో మంత్రి నారా లోకేశ్‌ను చిన్నతనంలో ఎత్తుకుని ఉన్న ఒక అరుదైన ఫొటోతోపాటు తన సహచరుడు, దివంగత నేత కోడెల శివప్రసాదరావుతో కలిసి ఉన్న మరో పాత జ్ఞాపకం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇవి కేవలం ఫొటోలు మాత్రమే కావు, తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకాలు కావడంతో నెటిజన్ల నుంచి వీటికి విపరీతమైన స్పందన వస్తోంది.
అదేవిధంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం ఈ 80s ట్రెండ్ పట్ల ఆకర్షితులయ్యారు. అయ్యన్న కూడా సీఎం చంద్రబాబు బాటను అనుసరించిన విధంగా ఏఐ మార్ఫింగ్‌ను పక్కనపెట్టి, తన అసలైన 80ల నాటి పాత ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్స్ వస్తుంటాయి, పోతుంటంటాయి. కానీ ఈ '80s ట్రెండ్' మాత్రం వినోదంతోపాటు గతంలోని మధురభావాలను తిరిగి గుర్తు చేయడమే అందరినీ ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఒకవైపు ఏఐ టెక్నాలజీతో కొత్తదనాన్ని ఆస్వాదిస్తుంటే, మరోవైపు అనుభవజ్ఞులైన నేతలు తమ నిజమైన పాత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా ఈ ట్రెండ్‌కు ఒక సరికొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టారని అంటున్నారు. మొత్తానికి, వర్తమానంలో ఉంటూనే గతాన్ని నెరుగజేస్తున్న ఈ 80s ట్రెండ్ సోషల్ మీడియాలో సరికొత్త సందడి చేస్తోంది.
'80s ట్రెండ్' ఎలా మొదలైంది?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 80s ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా మొదలైందని అంటున్నారు. సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన చాట్‌జీపీటీ తన ఏఐ టూల్స్‌లో ఫొటోలను మార్చే ఫీచర్లు ప్రవేశపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తమ ప్రస్తుత ఫొటోలను అప్‌లోడ్ చేసి 80ల నాటి స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. అదేసమయంలో సాధారణ విజువల్స్‌కే పరిమితం కాకుండా ప్రాంతీయతను సంతరించుకోవడంతో రెండు మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లతోపాటు రాజకీయ నేతలు కూడా 80s ట్రెండ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో వింటేజ్ ఫొటోల మోత మోగుతోంది.
