Begin typing your search above and press return to search.

సీమ బిడ్డ ఇమేజ్ బాబుకు దక్కినట్లేనా ?

బహుశా ఆ ధైర్యంతోనే జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు అనుకోవాలి. ఏపీలో అతి ప్రధానమైన రీజియన్ గా ఉన్న సీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 May 2025 8:15 AM IST
సీమ బిడ్డ ఇమేజ్ బాబుకు దక్కినట్లేనా ?
X

నారా చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతీయుడు అన్న ప్రశ్న బహుశా ఆయన టోటల్ రాజకీయ జీవితంలో ఎదురుకాలేదు. అలా ఆయన తన రాజకీయాన్ని నిర్మించుకున్నారు అని చెప్పాలి. ఆయన ఒక ప్రాంతానికి ఒక సామాజిక వర్గానికి పరిమితం కాదలుచుకోలేదన్నది ఆయన మార్క్ ఫిలాసఫీగా కూడా చెబుతారు. అది ఆయనకు రాజకీయంగా చాలా సార్లు అడ్వాంటేజ్ అయింది. కొన్ని సార్లు డిస్ అడ్వాంటేజ్ అయింది.

ఇదిలా ఉంటే చంద్రబాబు నిఖార్సు అయిన రాయలసీమ బిడ్డ. ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారి పల్లెలో జన్మించారు. అలా బాబును సీమ వాసి గానే చెప్పాలి. అయితే ఆయనకు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటున్న వైఎస్సార్ కుటుంబానికే సీమ బిడ్డ ఇమేజ్ దక్కుతూ వస్తోంది. వైఎస్సార్ ని సీమ జనాలు ఎంతగానో ఆదరించారు. అదే వరుసలో జగన్ ని కూడా సమాదరించారు.

బహుశా ఆ ధైర్యంతోనే జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు అనుకోవాలి. ఏపీలో అతి ప్రధానమైన రీజియన్ గా ఉన్న సీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి. రాజకీయంగా దాంతో రాయలసీమ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైఎస్సార్ రాజకీయ జీవితానికి కూడా సీమ అతి ముఖ్యమైంది. జగన్ కి కూడా అలాగే 2011లో పార్టీ పెట్టిన నాటి నుంచి 2019 దాకా ఏకంగా ఎనిమిదేళ్ళ పాటు ఆదుకుంటూ వచ్చింది.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే సీమ వాసిగా ఆయనా క్లెయిం చేసుకోవాలని పెద్దగా ఆరాటపడలేదు, జనాలు కూడా ఆయన విషయంలో అంతగా ఆలోచించలేదు. ఇక బాబు హయాంలో తెలుగుదేశం సీమలో అద్భుతమైన విజయాలు అయితే నమోదు చేయలేదు. ఎన్టీఆర్ హయాంలో మాత్రం సీమ ఆయన వెన్నంటి ఉంది.

కానీ 2024లో తొలిసారి చంద్రబాబు నాయకత్వానికి సీమ పట్టం కట్టింది. అది కూడా అలా ఇలా కాదు బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని అప్పగించింది. సీమ సైతం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతోనే జగన్ కి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కి ప్రతిపక్ష హోదాకు కూడా అందకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఎన్నికల ఫలితాలతో ఒక ముఖ్య సందేశం ఉంది అని అంటున్నారు. సీమకు మేలు చేసే విషయంలో సీఎం గా అయిదేళ్ళ పాటు ఉన్నా జగన్ చేసింది పెద్దగా లేదని అంటున్నారు. దాంతోనే బాబు వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఈ గెలుపు వెనక సందేశాన్ని జగన్ గ్రహించారో లేదో కానీ బాబు గ్రహించారు అని అంటున్నారు. అందుకే ఆయన గెలిచిన తరువాత ఫుల్ ఫోకస్ సీఎం మీద పెట్టేశారు.

కోస్తాంధ్రాలో మొత్తం 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో వైసీపీకి రాజకీయంగా గట్టి పట్టున్నవి లేవనే చెబుతారు. 2019లో ప్రభంజనం వీచి మాత్రమే వైసీపీ గెలిచింది. ఇక జనసేన తో పొత్తు ఉండడంతో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా ఉంది. అలాగే వైసీపీకి రాజకీయ బలం ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలు కూడా కూటమి దారిలోకి వచ్చేశాయి. అలా 22 సీట్లు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

ఇక మిగిలింది రాయలసీమలోని 52 సీట్లు. వీటిలో కనుక అత్యధిక శాతం సీట్లను గెలుచుకుంటే వైసీపీని డెడ్ ఈజీగా 2029లో ఓడించవచ్చు అన్నదే బాబు మాస్టర్ ప్లాన్. దాంతోనే ఆయన సీమ కోసం అనేక వరాలు ప్రకటిస్తున్నారు. గతానికి భిన్నంగా సీమ బిడ్డ ఇమేజ్ ని ఆయన సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక సీమ వాసులు అనేక ప్రయోగాలు చేసి అభివృద్ధికి దూరంగా ఉన్నారని చరిత్ర చెబుతోంది. ఈ నేపధ్యంలో సీమ వాసులలో అభివృద్ధి మీద ఆకాంక్ష పెరుగుతోంది. దానిని సరిగ్గా బాబు ఒడిసిపట్టుకున్నారు. ఈ టెర్మ్ లో బాబు కనుక సీమ ప్రగతి కోసం సరైన ప్రణాళికలతో ముందుకు వచ్చి వాటిలో కొన్ని అయినా అమలు చేస్తే వచ్చే ఎన్నికలు వైసీపీకి అంత సులువు కావని అంటున్నారు మొత్తానికి బాబు సీమ బిడ్డ ఇమేజ్ ని సాధిస్తారా లేక జగన్ కి వైఎస్సార్ వారసుడి ట్యాగ్ తో సీమ జనం అండగా నిలుస్తారా అనంది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.