Begin typing your search above and press return to search.

సీమ బిడ్డను...బాబు బిగ్ సౌండ్

రాయలసీమ తమ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అభివృద్ధిని సాధించింది అని చంద్రబాబు చెప్పే ప్రయంత్నంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాయలసీమ బిడ్డను అన్నారు.

By:  Satya P   |   24 Jun 2026 10:47 PM IST
సీమ బిడ్డను...బాబు బిగ్ సౌండ్
X

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడూ తన ప్రాంతం గురించి గట్టిగా చెప్పుకున్నది లేదు. ఆయన ఉమ్మడి ఏపీకి రెండు సార్లు విభజన ఏపీకి రెండు సార్లు సీఎం గా పనిచేశారు. కానీ బాబు ప్రాంతీయ భావాలకు దూరంగా ఉంటారు. ఆయన ఆలోచనా విధానమే వేరుగా ఉంటుంది. అలాంటి చంద్రబాబు తొలిసారి తాను రాయలసీమ బిడ్డను అని బిగ్ సౌండ్ చేశారు. అది కూడా సీమ గడ్డపైన నిలిచి ఈ మాటలు అన్నారు. బాబు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అన్నదే అంతా విశ్లేషిస్తున్నారు.

సీమ ప్రగతి కోసమే :

రాయలసీమ తమ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అభివృద్ధిని సాధించింది అని చంద్రబాబు చెప్పే ప్రయంత్నంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాయలసీమ బిడ్డను అన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని బాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తోందని కూడా బాబు చెప్పారు. రాయలసీమకు స్పేస్ ఏరో స్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ స్టీల్ సిమెంట్ క్లీన్ ఎనర్జీ రంగాలలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకువస్తామని కూడా హామీ ఇచ్చారు. అనంతపురంలో ఆనాడు కియా తెచ్చామని ఈనాడు అయిదవ జనరేషన్ ఫైటర్ జెట్ల ప్రాజెక్టు తెచ్చామని బాబు చెప్పారు. 2028 ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నామని కూడా బాబు తెలిపారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ది చేస్తున్నామని, తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమ తీసుకువచ్చామని, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి సీమలో కొత్త చరిత్ర మొదలైందని బాబు చెప్పారు. రానున్న రోజులలో రాయలసీమకు స్వర్ణ మయమే అని బాబు ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ టార్గెట్ :

ఇదిలా ఉంటే రాయలసీమలో గతంలో కాంగ్రెస్ కి బలం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత అదంతా వైసీపీకి బదిలీ అయింది. దాంతో 2014, 2019 ఎన్నికల్లో సీమలో వైసీపీ మంచి విజయాలు సాధించింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం రివర్స్ అయింది. కూటమి మొత్తం సీట్లను కొల్లగొట్టింది. కేవలం ఏడు సీట్లు మాత్రమే సీమలో వైసీపీకి దక్కాయి. దాంతో వైసీపీని ఇబ్బందుల్లో పడింది. ఈ నేపధ్యంలో సీమలో టీడీపీ పట్టు నిలుపుకునేందుకు చంద్రబాబు అనేక ప్రాజెక్టులను వరసగా ప్రారంభిస్తున్నారు. అంతే కాదు తాను రాయలసీమ బిడ్డను అని ఒక ఎమోషనల్ స్లోగన్ ఇచ్చారు అని విశ్లేషిస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ బాబు ఇచ్చిన ఈ స్లోగన్ సీమలో టీడీపీకి ఏ మేరకు పొలిటికల్ మైలేజ్ తెస్తుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.