రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి...రుణం తీర్చుకోవడానికేనా ?
రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించడంపై చర్చ మొదలైంది. ఓ వ్యాపారవేత్త, మీడియా సంస్థల అధినేత జయంతికి ప్రజాధనం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి రామోజీరావు అందించిన రాజకీయ మద్దతుకు చంద్రబాబు నిర్ణయం గురుదక్షిణలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
By: Madhu Reddy | 17 Nov 2026 8:00 PM ISTరామోజీరావు జయంతిని ఇక మీదట రాష్ట్ర పండుగగా అధికారికంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అతి పెద్ద చర్చకు తావిస్తోంది. విజయవాడలో కేంద్ర మంత్రి అమిత్ షాతో , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల సమక్షంలో దివంగతత మీడియా దిగ్గజం రామోజీరావు 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదే వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై ప్రతి ఏటా నవంబర్ 16వ తేదీన ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రముఖుల జన్మ దినాలను అధికారికంగా నిర్వహించడం కొత్త ఏమీ కాదు, కానీ చెరుకూరి రామోజీరావు జయంతిని అలా నిర్వహించడం మీదనే చర్చ సాగుతోంది. ఎపుడైతే బాబు నోట ఈ ప్రకటన వెలువడిందో మరుసటి క్షణం నుంచే సోషల్ మీడియాలోనూ మేధావి వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఒకే ఒక ప్రశ్న గట్టిగా అసలు ఒక వ్యాపారవేత్త పుట్టినరోజును రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఏమిటి అన్నది ఆ ప్రశ్న.
రాష్ట్ర పండుగ అంటే గౌరవం :
అధికారికంగా ఎవరైనా ప్రముఖుడి జయంతిని జరపాలీ అంటే అది అత్యున్నత గౌరవంగా చూస్తారు. మరి బాబు ప్రకటనతో దీనికి అర్థం మారిపోయిందా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులు, కులమత అసమానతలపై పోరాడిన సంఘ సంస్కర్తలు, తెలుగు భాషకు లేదా కళలకు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రజా నాయకుల జయంతులను మాత్రమే ఎక్కడైనా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తాయి. ఇప్పటిదాకా అదే ఆచారంగా వస్తోంది. మరి రామోజీరావు ఆ కేటగిరీలోకి వస్తారా అన్నది కీలక ప్రశ్న. ఆయన మీడియా సంస్థకు అధిపతి. అంతే కాదు విజయవంతమైన వ్యాపార వేత్తగా ఉన్నారు. ఒక కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి జయంతిని ఏకంగా రాష్ట్ర పండుగ జాబితాలో చేర్చడం ఏమిటి విడ్డూరం కాకపోతే అన్న మాట వినిపిస్తోంది. ఒక విధంగా రాష్ట్ర పండుగ పవిత్రతను, విలువను తగ్గించారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
వ్యాపార దక్షుడిగానే :
రామోజీరావు తన అసాధారణమైన మేధస్సులో వ్యాపార దక్షుడుగా నిలిచారు. తన మీడియా సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించి తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అలాగే తన టీవీ చానళ్ళతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. హైదరాబాద్ శివార్లలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని నిర్మించారు. అనేక ఇతర వ్యాపారాలతో ఆయన వ్యాపార సమర్ధత చాటుకున్నారు. అయితే ఇది కేవలం రామోజీరావు అనే కాదు ఎవరైనా తమ వ్యాపార విస్తరణ కోసం ఇలాగే అనేక సంస్థలను ఏర్పాటు చేస్తారు, వాటిలో విజయవంతం అవుతారు, అంత మాత్రం చేత వారు తెలుగు జాతికి కీర్తి పతాకలు అవుతారా అన్నది నిలువెత్తు ప్రశ్న. అయితే రామోజీరావు వ్యాపార దక్షతకు 2016లోనే దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇక ప్రకృతివిపత్తుల సమయంలో తన మీడియా ద్వారా విరాళాలు సేకరించి ఇవ్వడం తాను పుట్టిన రాష్ట్రానికి రాజధానికి 'అమరావతి' అనే పేరును సూచించడం వంటివి ఆయన చేసినవి అయితే అ ప్రశంసనీయమే కావచ్చు. అంత మాత్రం చేత రాష్ట్ర పండుగగా ఆయన జయంతిని ఎలా నిర్వహిస్తారు అన్న దానినే మేధావులు తరచి ప్రశ్నిస్తున్నారు.
రుణ బంధమేనా :
ఇక చంద్రబాబు తనకు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని అదే వేదిక మీద గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న 45 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు తమ మీడియా ద్వారా రామోజీరావు టీడీపీకి ఏ స్థాయిలో అండగా నిలిచారో తెలుగు రాజకీయాలను గమనించే ఎవరికైనా తెలిసిన బహిరంగ రహస్యం అని చెబుతారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడంలో అయినా ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నిలదొక్కుకోవడంలో అయినా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ పోరాటాల్లో అయినా ఒక మీడియా సంస్థ ద్వారా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నుంచి ఆలోచన చేస్తే చంద్రబాబు తీసుకున్న ఈ రాష్ట్ర పండుగ నిర్ణయం తమ పార్టీకి ఆయన అందించిన దశాబ్దాల రాజకీయ మద్దతుకు చెల్లిస్తున్న గురుదక్షిణలా కనిపిస్తోందనే అభిప్రాయాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.
ప్రతీ ఏటా ప్రజల సొమ్ముతో :
ఇంతకీ రాష్ట్ర పండుగ అని ప్రకటిస్తే అభ్యంతరం ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఒకరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అంటే ప్రతి ఏటా నవంబర్ 16న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రజాధనాన్ని అంటే ప్రజలు కట్టే పన్ను నుంచి ఆ ఖర్చు భరాయించాల్సి వస్తుంది. మరి ఏపీ పరిస్థితి చూస్తే తీవ్ర ఆర్థిక లోటులో, అప్పుల ఊబిలో ఉందని స్వయంగా ప్రభుత్వమే చెబుతోంది. సంక్షేమ పథకాలకు అభివృద్ధి పనులకు నిధులు సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ మీడియా అధినేత పుట్టినరోజు వేడుకలకు ప్రజాధనాన్ని వెచ్చించడం ఎంతవరకు న్యాయం అంటే జవాబు ఉందా అని అంటున్నారు.
తప్పుడు సంప్రదాయమేనా :
ఒక వ్యక్తి ఎంతటి గొప్ప వారు అయినా తమకు బాగా కావాల్సిన వారు అయినా కూడా ప్రభుత్వ పరంగా ఉండే కొన్ని సంప్రదాయాలను కూడా కాదని ఈ విధంగా మమకారంతో తీసుకునే నిర్ణయాలు ముమ్మాటికీ ఒక తప్పుడు సంప్రదాయానికి తెరతీసినట్లే అవుతాయని అంటున్నారు. ఇక రేపు వైసీపీనో, మరో పార్టీనో అధికారంలోకి వస్తే తమకు అనుకూలంగా ఉన్న మీడియా అధినేతల లేదా తమ సొంత కుటుంబ సభ్యుల పుట్టినరోజులను కూడా ఇదే తరహాలో రాష్ట్ర పండుగలుగా ప్రకటిస్తే అప్పుడు టీడీపీ లాంటి పార్టీ ఏ విధంగా వారిని విమర్శించగలవు అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా రామోజీరావును ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా తెలుగు జర్నలిజం దిగ్గజంగా అంతా గౌరవిస్తారు. కానీ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి ఒక వ్యాపారవేత్త జయంతిని ఏకంగా రాష్ట్ర పండుగగా మార్చడం మాత్రం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగానే అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మెచ్చుకోలు కంటే విమర్శలకే తావిస్తుంది అని ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తే మంచిది అని అంటున్నారు.
