పవన్ ఐ యామ్ వెరీ హ్యాపీ.. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి కలెక్టర్ల సదస్సులో చోటుచేసుకున్న ఓ సంఘటనే నిదర్శనంగా చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 17 Dec 2025 7:10 PM ISTకూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి కలెక్టర్ల సదస్సులో చోటుచేసుకున్న ఓ సంఘటనే నిదర్శనంగా చెబుతున్నారు. బుధ, గురువారాల్లో ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. బుధవారం సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపాన్యాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరూ కలిసి ప్రోయాక్టివ్ గా పనిచేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజా సమస్యల పరిష్కారంపై తీసుకుంటున్న చర్యలు.. అందులో ఇద్దరు నేతల భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే కూటమిలోని ముఖ్యనేతల మధ్య ఎంతటి చక్కని అవగాహన ఉందనేది స్పష్టమవుతోందని అంటున్నారు.
డిఫరెంట్ ఫీల్డు నుంచి వచ్చినా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమర్థంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇటీవల కాలంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంపై పవన్ తీసుకుంటున్న చొరవను చంద్రబాబు కొనియాడారు. కొద్దిరోజుల క్రితం అంధుల క్రికెట్ టోర్నీలో విజేతలను అభినందించిన పవన్.. అనంతపురం జిల్లాకు చెందిన క్రీడాకారిణి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరిన వెంటనే.. నిధులు మంజూరు చేశారు. ఈ విషయం మరచిపోకముందే మంగళవారం కూడా అలాంటిదే మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నే సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమక్షంలో ప్రస్తావించి పవన్ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న బాధ్యతలపై తాను చాలా ఆనందంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమక్షంలోనే ప్రకటించడం గమనార్హం. ‘‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. బాగా పనిచేస్తున్నారు’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. మంగళవారం కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసిన సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానిస్టేబుల్ గా ఎంపికైన అల్లూరి జిల్లాకు చెందిన ఓ గిరిజన అభ్యర్థి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరారని, తాను ఆ విషయాన్ని చూడాల్సిందిగా పవన్ కు చెబితే.. మీటింగు ముగిసేలోగా రూ.3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడంపై సీఎం చంద్రబాబు కొనియాడారు.
‘‘ద టీజ్ రెస్సాన్స్.. మీరంతా గుర్తు పెట్టుకోవాలి.. బాధ్యత గల ప్రభుత్వం అంటే అధికారాలను దుర్వినియోగం చేయకూడదు.. సద్వినియోగం చేయాలి’’ అంటూ పవన్ కృషిని ప్రస్తావించారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కోసం తాము పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైనా చంద్రబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి ఉరికే పెట్టుబడులు రావడం లేదని, దాని వెనుక మంత్రి నారా లోకేశ్ శ్రమ ఉందని అభినందించారు. లోకేశ్ అమెరికా వెళ్లినప్పుడు గూగుల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని, ఆయన ఎప్పుడో వేసిన విత్తనం వల్లే గూగుల్ మన రాష్ట్రాన్ని ఎంచుకుందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టాలని తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చంద్రబాబు తెలిపారు.
ఇక కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి నారా లోకేశ్ తోపాటు మొత్తం మంత్రివర్గం హాజరైంది. అదేవిధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. మొత్తం రాష్ట్రం పరిపాలన, కార్యనిర్వహక యంత్రాంగం ఉన్న సమయంలో పవన్, లోకేశ్ పనితీరుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంట్రస్టింగుగా మారాయి. పవన్ కు పరిపాలన అనుభవం లేకపోయినప్పటికీ ఆయన పనితీరుతో ఆకట్టుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు కూటమిలో టీడీపీ-జనసేన బంధం మరింత ధృడంగా మారేందుకు దోహదపడతాయని అంటున్నారు.
