అచ్చన్న అదుర్స్.. చంద్రబాబు ప్రశంసలు!
ఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చన్నాయుడుని సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు.
By: Garuda Media | 9 May 2026 5:00 AM ISTఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చన్నాయుడుని సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన పనితీరు చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారని తెలిపారు. గంటల్లో ఫైళ్ల పరిష్కారం చేశారని ప్రశంసలు గుప్పించారు. పారదర్శకత, వేగం, సమర్థత.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకత అని తెలిపారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారని అన్నారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అచ్చెన్న తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకు దనాన్ని పెంచుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు... ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను డిస్పోజ్ చేస్తుండటం పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని వెల్లడించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌ను రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగుతున్న మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతోందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఇదే పనితీరును ఇతర మంత్రులు కూడా అలవరుచుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు పాలన అందించడంతోపాటు.. ఈ-ఫైళ్లపై వేగంగా దృష్టి పెట్టాలని తెలిపారు.
