వైసీపీకి నో చాన్స్...బాబు రాజకీయ మంత్రాంగం !
ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ కొనసాగుతోంది. ఒక పార్టీ అయిదేళ్ళు పాలిస్తే మరో పార్టీ తరువాత అయిదేళ్ళకూ అధికారాన్ని అందుకుంటోంది.
By: Satya P | 3 Nov 2025 9:06 AM ISTఏపీలో రెండు పార్టీల వ్యవస్థ కొనసాగుతోంది. ఒక పార్టీ అయిదేళ్ళు పాలిస్తే మరో పార్టీ తరువాత అయిదేళ్ళకూ అధికారాన్ని అందుకుంటోంది. ఇది విభజన ఏపీలో పొలిటికల్ హిస్టరీగా ఉంది. 2014లో చూస్తే టీడీపీ గెలిచి అధికారం చేపట్టింది. 2019 నాటికి చూస్తే వైసీపీ గెలిచింది. బంపర్ మెజారిటీ కూడా సాధించింది. 2024 తిరిగేసరికి మళ్ళీ టీడీపీ కూటమి పవర్ ని సొంతం చేసుకుంది. ఇలా చూస్తే కనుక ప్రతీ ఎన్నికకూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది ఒక రాజకీయ విశ్లేషణ. అయితే ఈసారి ఆ చాన్స్ లేనే లేదు అంటున్నారు అర్ధ శతాబ్దం రాజకీయాలను చూసిన వారు విశేష అనుభవం గడించిన వారు అయిన ఏపీ సీఎం చంద్రబాబు.
నిజమైన విశ్లేషణతో :
చంద్రబాబు నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన అంతకు ముందు ఉమ్మడి ఏపీలో రెండు సార్లు సీఎంగా చేశారు. విభజన ఏపీలో మరో రెండు సార్లు అయ్యారు. గతంలో చూస్తే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ బలంగా ఉండేది, ఎంతో మంది దిగ్గజ నేతలు ఉండేవారు. అందులో వారిలో వారికే పోటీగా ఉండేది. దాంతో టీడీపీకి అది ఒక ఈజీ టాస్క్ గానూ మారింది. అలా 1999 ఎన్నికల్లో టీడీపీ బాబు నాయకత్వంలో రెండోసారి గెలిచింది. అయితే 2004 కి వచ్చేసరికి మాత్రం సీన్ మారింది దానికి కారణం కాంగ్రెస్ ని ఏకత్రాటిపైకి తీసుకుని వచ్చి వైఎస్సార్ బాబుకు బలమైన ప్రత్యర్ధిగా మారారు.
కొంత లైట్ తీసుకున్నారు :
ఇది రాజకీయంగా ప్రధానమైతే బాబు చేపట్టిన పాలనాపరమైన సంస్కరణలు అంతే కాకుండా ఆయన పూర్తిగా డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి పార్టీ మీద దృష్టి కొంత తగ్గించడం అని చెబుతారు. మొత్తానికి ఆ విధంగా ఓటమి జరిగింది. 2009లో అయితే టీడీపీ కచ్చితంగా గెలిచేదే కానీ మూడవ పార్టీ వచ్చి అవకాశాలు దెబ్బ తీసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2014 నాటికి బాబు అనుభవం అన్న నినాదంతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన అమరావతి రాజధాని మీదనే దృష్టి పెట్టడంతో పాటు పార్టీని కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. పైగా వైసీపీని కొంత లైట్ తీసుకున్నారు అని అంటారు.
ఫుల్ ఫోకస్ తో :
అన్నీ పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు 2024 ఎన్నికల తరువాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండానే ముందుకు సాగుతున్నారు. ఆయన అటు పాలన, ఇటు పార్టీ రెండూ చూస్తున్నారు. అంతే కాదు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ కూడా బాలెన్స్ చేస్తున్నారు. కూటమి అనుకూల ఓట్లను కన్సాలిడేటెడ్ చేసుకోగలిగారు. చీలికలు లేకుండా కూటమి కట్టారు. అది బలంగా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ ఓటమి తరువాత మరింత ఇబ్బందులు పడుతోంది. జగన్ అయితే పెద్దగా జనాల్లోకి రావడం లేదు, విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది. దాంతో పాటు కూటమి సాలిడ్ గా దాదాపుగా 60 శాతం ఓటు షేర్ ని 2024లో రాబట్టింది. ఇందులో ఏ మాత్రం కొంత తగ్గినా కూడా 2029 లో తిరిగి గెలిచేందుకు నూరు పాళ్ళూ అవకాశాలు ఉంటాయని బాబు అంచనా వేస్తున్నారు.
మొత్తం నట్లు అన్నీ :
అంతే కాదు ఈ నేపథ్యంలో కూడా వైసీపీని ఎక్కడా కూడా ఆయన లైట్ తీసుకోవడం లేదు, ఆ పార్టీని పక్కన పెట్టాలనే చెబుతున్నారు ప్రజలకు కూడా వైకుంఠపాళీ ఆట ఆడవద్దు అని చెబుతున్నారు. ఒకే పార్టీ పదికాలాలు అధికారంలో ఉంటే కనుక కచ్చితంగా అభివృద్ధి సాగుతుందని అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీని సంస్థాగతంగా మునుపటి తీరులో ఉన్న బలం ఉందా అన్నది కూడా కూటమిలో చర్చగా ఉంది. జగన్ పాలనను జనాలు ఒకసారి చూసారు కాబట్టి 2019 నాటి పరిస్థితులు మళ్ళీ లేకపోవచ్చు అన్నది కూడా ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బాబు మొత్తం నట్లు అన్నీ బిగించేస్తున్నారు. తనదైన రాజకీయ మంత్రాంగంతో ముందుకు సాగుతున్నారు. అటూ ఇటూ మొత్తం ఏపీ రాజకీయ చదరంగం అంతా బాబే ఆడుతున్న ఈ నేపథ్యంలో వైసీపీ దీనిని ఏ విధంగా చేదిస్తుంది అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది.
