పేదల ఇంట్లో బాబు....4.0 అంటే ఇదే మరి !
ఇదిలా ఉంటే చంద్రబాబు 2024లో గెలిచామని అద్భుతాలు చేశామని ఊరకే సంబరపడడంలేదు. ఆయన గెలిచింది లగాయితూ 2029 అంటున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 9:23 AM ISTచంద్రబాబు రాజకీయ వ్యూహకర్త అన్నది తెలిసిందే. ఆయన ఎపుడూ కాలానికి కంటే ముందు ఉంటారు. అందుకే ఆయన జోరుని ఎవరూ అందుకోలేరు. ఒక్కోసారి ఆయన అంచనాలు ఫెయిల్ అయినా చాలా సార్లు హిట్ అయ్యాయి. అందుకే బాబు అంటే అందరికీ ఒక విధమైన నమ్మకం ఉంటుంది. ఆయన తన పక్షంలో ఉంటే తిరుగులేదని అనుకుంటారు. ఎదుటి పక్షంలో ఉంటే ఇబ్బందే అని భావిస్తారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు 2024లో గెలిచామని అద్భుతాలు చేశామని ఊరకే సంబరపడడంలేదు. ఆయన గెలిచింది లగాయితూ 2029 అంటున్నారు. దానికి ఇప్పటి నుంచే చేయాల్సినది అంతా చేస్తున్నారు. జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన అనుకోవడం లేదు. ఆయన పార్టీకి 40 శాతం ఓటు షేర్ ఉందనే గుర్తు పెట్టుకుంటున్నారు.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి 60 శాతం ఓటు షేర్ దక్కింది. అయితే ఈసారి దానిని మరింతగా పెంచాలని బాబు చూస్తున్నారు. అంటే వైసీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టాలన్నదే ఒక భారీ టార్గెట్ అన్న మాట. వైసీపీకి ఎక్కువగా పేదలు అట్టడుగు వర్గాలలో బలం ఉంది అని ఒక అంచనా.
అందుకే బాబు గురి చూసి మరీ వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒకేసారి వేయి రూపాయలు సామాజిక పెన్షన్ పెంచడానికి కారణం కూడా అదే. అంతే కాదు పంటి బిగువున ఏపీ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నా కూడా తల్లికి వందనం ఇవ్వడానికి రీజన్ అదే. అంతే కాదు అన్న దాతా సుఖీభవను ఇరవై వేలకు పెంచి అమలు చేస్తున్నారు. వీటికి తోడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం అమలు చేయబోతున్నారు.
ఇక నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధపడుతున్నారు అంటే జగన్ ఓటు బ్యాంక్ చెల్లాచెదురు చేయడమే లక్ష్యంగా చేసుకున్నారు అన్న మాట అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతీ నెలా పెన్షన్ ఇవ్వడం కోసం ఏదో ఒక గ్రామానికి బాబు వెళ్లాలా అని ప్రశ్నించే వారు ఉన్నారు. అయితే దీని వెనకాల బాబు మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు.
ఆయన నేరుగా పేదల ఇళ్లలోకి వెళ్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. వీలుంటే టీ కూడా కాస్తున్నారు. అలాగే వారితో కలసి ముచ్చటిస్తున్నారు. వారికి ఏమేమి కావాలో అడిగి మరీ వరాలు ఇస్తున్నారు. అలా పేదలందరితోనూ రచ్చబండ సమావేశాలు పెడుతున్నారు.
ఇక తాజాగా బాబు తూర్పుగోదావరి నిడదవోలు పర్యటనకు వెళ్ళినపుడు అక్కడ ఒక పేదవాడిని స్వయగా తన కారులో ఎక్కించుకుని మరీ రెండు కిలోమీటర్ల దూరం తీసుకుని వచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళి మరీ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇలా ఒక చీఫ్ మినిస్టర్ తన కారులో నిరుపేదను ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిన సన్నివేశం వర్తమానంలో ఎక్కడా లేదు. దాంతో బాబు పేదల హీరో అయిపోయారు.
ఆయన ఇదే తీరున ప్రతీ చోటా చేస్తున్నారు. ఎక్కడ పర్యటనలు చేసినా పేద వారిని కలుసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు వారితో మమేకం అవుతున్నారు. దాంతో పేదలు అంతా బాబు మావాడే అని సొంతం చేసుకోవడం జరుగుతుందని టీడీపీ అంచనా వేసుకుంటోంది. వైసీపీకి పేదలలో ఉన్న బలాన్ని అలా తీసివేయడమే కాకుండా కూటమి ఖాతాలోకి చేర్చడమే బాబు ఆలోచన అని అంటున్నారు.
చంద్రబాబు గురించి చెప్పాలీ అంటే చాలా ఉంది. ఒకనాడు ఆయన ఉమ్మడి ఏపీకి సీఈవోగా అనిపించుకోవడానికి పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అలాంటి బాబు నాలుగవ సారి సీఎం అయ్యేనాటికి పేదల బాబుగా మారిపోయారు. పేదరికం ఏపీలో పోగోడుతామని చెబుతున్నారు. ఏపీలో అందరినీ సంపన్నులను చేస్తామని పీ 4 పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది బాబులో వచ్చిన అతి పెద్ద మార్పుగా ఉంది.
మొత్తం మీద రాజకీయ వ్యూహమే అనుకున్నా బాబు బాగా మారిపోయారు అని అంటున్నారు. ఆయన గత వ్యవహార శైలికి ఇది భిన్నంగా ఉండడంతో బాబు మార్క్ చాణక్య రాజకీయాలకు అంతా ఔరా అనుకోవాల్సి వస్తోంది. మరి ఇవన్నీ రేపటి ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంక్ ని ఎంతలా చిల్లు పెడతాయో చూడాల్సి ఉంది.