చంద్రబాబుకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది ఎవరు ?
చంద్రబాబుకు రాజకీయ ఆసక్తి ఉండొచ్చు. ఆయన విద్యార్థి నాయకుడిగా సక్సెస్ కావచ్చు.
By: Tupaki Desk | 26 Jun 2025 10:00 PM ISTచంద్రబాబుకు రాజకీయ ఆసక్తి ఉండొచ్చు. ఆయన విద్యార్థి నాయకుడిగా సక్సెస్ కావచ్చు. కానీ డెబ్బై దశకంలో ఉమ్మడి ఏపీలో ఉన్న అతి పెద్ద పార్టీ కాంగ్రెస్. అంతే కాదు అధికారంలో ఎపుడు ఉండే పార్టీ కూడా కాంగ్రెస్. ఆ పార్టీలో చేరాలని ఎంతో మందికి ఆశ ఉండేది. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే చాలు రాజకీయం టర్న్ అవుతుందని ఆరాటం కూడా ఉండేది.
మరి ఇలాంటి పరిస్థితులలో తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఒక నవ యువకుడికి రాజకీయ రంగ ప్రవేశం ఎలా దొరికింది. ఆయన ముందూ వెనకా ఎవరూ రాజకీయంగా బలమైన నాయకులు లేని పరిస్థితులలో ఆయన ఆశలు ఎలా తీరాయి, అసలు చంద్రబాబుకు పొలిటికల్ లైఫ్ ఇచ్చింది ఎవరు ఇది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఎందుకు అంటే దాని వెనక చాలా ఉంది కాబట్టి.
ఇక చూస్తే చంద్రబాబు రాజ్యాంగ హత్య దినంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా విమర్శించారు. అయితే ఇక్కడే చంద్రబాబు విషయంలో అనేక ప్రశ్నలు వేస్తున్నారు. కాంగ్రెస్ చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చినది నిజం కాదా అని అంటున్నారు. నిజానికి చంద్రబాబుది రాజకీయ కుటుంబం ఏమీ కాదు కదా అని అంటున్నారు.
ఆయనకు చేరదీసి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నది గుర్తుంచుకోవాలి కదా అని అంటున్నారు. అంతే కాదు కేవలం నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఈ రోజున కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోస్తున్న చంద్రబాబు ఒక్కసారి తన ఫ్లాష్ బ్యాక్ ని చూసుకుంటే కనుక ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తుకు వస్తుందని అంటున్నారు.
అదే విధంగా చూస్తే కనుక 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ టికెట్ ని బాబు పొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలా ఆయన చట్ట సభలలో ప్రవేశించారు. మంత్రి కూడా అయ్యారు. ఆ మీదటనే ఆయనను చూసి అప్పటి తెలుగు సినిమా నంబర్ వన్ నటుడు ఎన్టీఆర్ ఆయనకు తన కుమార్తెని ఇచ్చి అల్లుడిగా చేసుకున్నారు.
అలా ఎన్టీఆర్ కుమార్తెను చేసుకోకపోతే బాబు ఈ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారా అన్న చర్చ కూడా ఉంది. చంద్రబాబుకి ఈ రకమైన రాజకీయ జీవితం కానీ ఉన్నతి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాయని కూడా గుర్తు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు అవన్నీ మరచి కాంగ్రెస్ ని తూలనాడడం ఎంతవరకూ సబబు అని అంటున్నారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులతో దేశాన్ని ఆనాడు ఇందిర కష్టాలు పెట్టిందని అనేక మంది జైళ్లలోకి నెట్టిందని ప్రజల హక్కులను కూడా కాలరాసిందని చంద్రబాబు ఘాటైన విమర్శలే చేశారు.
అయితే ఆనాడు అలా ఎమర్జెన్సీ విధింపు అన్నది చేయాల్సి వచ్చింది కాబట్టి చేసింది అని అంటున్న వారూ ఉన్నారు. అయితే 1975లో ఎమర్జెన్సీ విధిస్తే 1978లో అదే ఇందిరాగాంధీ పెట్టిన కాంగ్రెస్ లో చేరి చంద్రబాబు టికెట్ సంపాదించలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఉంటే ఇందిరాగాంధీ విధానాలు నచ్చకపోయి ఉంటే బాబు ఎందుకు ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ లో చేరారు అన్న ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు.
నాడు ఇందిరమ్మ టికెట్ ఇవ్వడం ఆమె ప్రభంజం ఏపీ అంతటా వీయడంతో చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని అంతా అంటున్నారు. ఆ మీదట కాంగ్రెస్ చలవతోనే మంత్రి దక్కిందని ఈ రోజు బాబు పొజిషన్ కి కాంగ్రెస్ ఎంతో కారణం అయిందని అంటున్నారు. జగన్ ని విమర్శించడానికి చంద్రబాబు కాంగ్రెస్ ని తిడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి కాంగ్రెస్ విధానాలు నచ్చక 1984లో బాబు టీడీపీలో చేరారు అనుకున్నా కూడా 2018లో తెలంగాణా ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఎందుకు అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒకరిని విమర్శిస్తూ ఒకరిని పొగుడుతూ ముందుకు సాగితే ఎలా అని మేధావులు కూడా అంటున్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తారని ఏ ఒక్క అంశం వారి మనసులో నుంచి బయటకు పోదని కూడా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేత కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ తో బాబు ఎదిగారు అన్నది సూర్యుడు తూర్పున ఉదయించును అన్నది ఎంతటి నిజమో అంతటి నిజమని అంటున్నారు. మరి బాబు అయితే ఈ రోజున కాంగ్రెస్ ని విమర్శిస్తూ మోడీ వైపు మాట్లాడుతున్నారు. మరి రేపు ఆయన ఏమి మాట్లాడుతారు అంటే అది జనాలు ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు.
