ఇది చంద్రబాబు ‘ప్రతివ్యూహం’!.. టీజర్ రిలీజ్.. సినిమాపై సస్పెన్స్
ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే గొప్ప సాధనం సినిమా.. అది వెండితెరపై అయినా, బుల్లి తెరపై అయినా సినిమాకు ఉన్న ప్రత్యేకత వేరు.
By: Tupaki Desk | 30 Aug 2025 9:00 PM ISTప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే గొప్ప సాధనం సినిమా.. అది వెండితెరపై అయినా, బుల్లి తెరపై అయినా సినిమాకు ఉన్న ప్రత్యేకత వేరు. అందుకే రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం సినిమాను, సినీ ప్రముఖులను వాడుకుంటారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరి కంటే ముందుంటారు. టీడీపీ పార్టీని ఓ సినీ ప్రముఖుడు స్థాపించినా, ఆ తర్వాత ఎక్కువగా సినీ రంగాన్ని తన రాజకీయం కోసం వాడుకున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అని చెబుతారు. ఇప్పటికీ ఆయనకు సినీ రంగంలో ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. ఇక ఆయన సహచరుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే. సినీ రంగాన్ని వాడుకోవడంలో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో వ్యూహాన్ని రచించారు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టే ‘ప్రతివ్యూహం’అని కూడా అంటున్నారు.
ఇప్పుడు టీజర్ మాత్రమే చూస్తున్నారు.. త్వరలో సినిమా విడుదల కాబోతోంది.. అంటూ కొద్ది రోజుల క్రితం టీడీపీ సోషల్ మీడియా రెండు నిమిషాల వీడియోను బయటకు వదిలింది. ఏపీ లిక్కర్ స్కాంపై రూపొందించిన సినిమాకు ఆ వీడియో టీజర్ గా చెబుతున్నారు. పవర్, మనీ, పాయిజన్ అనే క్యాప్షన్ తో విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఏపీలో రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని, 2019 నుంచి 2024 వరకు మద్యం పేరుతో విషాన్ని విక్రయించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని ఆ వీడియోలో వివరిస్తూ విజువలైజేషన్ చేశారు. పలువురి అభిప్రాయాలకు చోటు కల్పించారు. ఈ వీడియో ద్వారా లిక్కర్ స్కాంలో అసలు ఏం జరిగిందో ప్రజలకు పూర్తిగా వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
వీడియోల ద్వారా ప్రజలను ఆకర్షించి, డబ్బు కోసం గత పాలకులు ఎలా అడ్డదారులు తొక్కిందీ వివరించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని అంటున్నారు. వీక్షకుడిని మానసికంగా, భావోద్వేగంగా, మేధోపరంగా ప్రభావితం చేయడానికి ప్రభుత్వ అనుకూల వర్గాలు ఈ సినిమాను చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో గతంలో ఇలాంటి పొలిటికల్ మూవీస్ ఎన్నో వచ్చాయి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వ్యూమం, శపథం అనే సినిమాలు విడుదల అవ్వగా, వాటికి కౌంటరుగా టీడీపీ కూడా వివేకం, రాజధాని ఫైల్స్ అనే సినిమాలను నిర్మించింది. అయితే ఈ సినిమాల్లో కంటెంట్ ను ప్రజలకు తెలియజేయడంలోనే ఆయా పార్టీలు అనుసరించిన వైఖరి కూడా ఇక్కడ చర్చనీయాంశమవుతోంది.
రాజకీయ లక్ష్యాల కోసం తీసిన సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో టీడీపీ అనుసరించిన విధానం ఎక్కువ ఫలితం ఇచ్చిందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ సరైన ఫలితం అందుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ప్రజలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమాలను ప్రజలు డబ్బులు చెల్లించి చూడాలని అనుకోరన్న విషయాన్ని ఆయా పార్టీలు గుర్తించాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఈ సంగతి తెలిసిన టీడీపీ తాను రూపొందించిన సినిమాలను యూట్యూబ్, ఇతర ఓటీటీ ప్లాట్ ఫారంలపై ఉచితంగా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది. దీంతో ఆయా సినిమాలను చూసిన వారు ఆ పార్టీతో కనెక్ట్ అయ్యారని అంచనా వేస్తున్నారు. కానీ, వైసీపీ వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి అక్కడ సక్సెస్ కాక నష్టాలను చవిచూసిందని అంటున్నారు.
అయితే గతంలో వ్యూహం, శపథం వంటి సినిమాలతో టీడీపీని తీవ్రంగా టార్గెట్ చేసిన వైసీపీకి కౌంటరుగా టీడీపీ కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాంపై సినిమాను రూపొందించిందని అంటున్నారు. ఈ సినిమా టీజరే లక్షల్లో వ్యూస్ సంపాదించినట్లు చెబుతున్నారు. ఒకవైపు లిక్కర్ స్కాంపై అరెస్టులు, ఆస్తుల జప్తు వంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు సోషల్ మీడియాను వాడుకుని ప్రతిపక్షాన్ని మరింతగా భ్రష్టు పట్టించాలనే ఆలోచనే ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.
