Begin typing your search above and press return to search.

ఎస్పీలకు ఫుల్ పవర్స్.. చంద్రబాబులో ఎప్పుడూ చూడని కోణం

ముఖ్యమంత్రి చంద్రబాబులో ఎప్పుడూ చూడని కోణం కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By:  Tupaki Desk   |   14 Sept 2025 3:00 PM IST
ఎస్పీలకు ఫుల్ పవర్స్.. చంద్రబాబులో ఎప్పుడూ చూడని కోణం
X

ముఖ్యమంత్రి చంద్రబాబులో ఎప్పుడూ చూడని కోణం కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యమంత్రిగా కాకుండా తనను తాను చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (సీఈవో)గా చెప్పుకునేందుకు గతంలో ఇష్టపడిన చంద్రబాబు.. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని, ప్రధానంగా ప్రభుత్వంపై వచ్చే విమర్శలను చాలా సీరియస్ గా తీసుకుంటూ తనలో కొత్త చంద్రబాబును చూపిస్తున్నారని అంటున్నారు.

అధికారంలోకి వచ్చిన కొత్తలో తనకు 75 ఏళ్ల వయసు వచ్చినంత మాత్రాన.. తనో జోరు తగ్గిపోయిందని ఏ మాత్రం అనుకోవద్దని చంద్రబాబు చెప్పారు. దీనికి తగినట్లే ఇప్పుడు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేనట్లు ఈ సారి పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండగా, పాలనకు సవాల్ గా మారిన మతకలహాలు, నక్సల్స్ ఉద్యమాన్ని గట్టిగా అణచివేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ కూడా చంద్రబాబు అదుపు చేశారని అంటున్నారు. 2014లో సీఎం అయ్యాక ఈ సమస్యలు ఏవీ లేకపోయినా అప్పట్లో సోషల్ మీడియా విసిరిన సవాళ్లను చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నారు. దానికి 2019లో మూల్యం చెల్లించారని అంటారు.

అయితే ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారని అంటున్నారు. దీంతో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాజకీయ కుట్రలను అణచివేయాలనే ఉద్దేశంతో ఎస్పీలకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు సీఎం. ఫేక్ ప్రచారం చేయడం, ప్రజల్లో గందరగోళం స్రుష్టిస్తున్న వారిని ఏ మాత్రం విడిచిపెట్టొద్దని అంటున్నారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు పవర్ వాడటానికి చంద్రబాబు సిద్ధమయ్యారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గతంలో ఎప్పుడూ కూడా ఇలా రాజకీయ ప్రత్యర్థులను అదుపు చేసేందుకు పోలీసులను వాడలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు మిగిలిన అన్ని సమస్యలు కన్నా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఫేక్ ప్రచారమే ఆయనకు పెద్ద తలనొప్పిగా పరిణమించిందనే భావనతో ఎస్పీలకు పూర్తి అధికారం ఇచ్చి వారి ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారి సంగతి తేల్చాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే ఎస్పీలకు ఇలాంటి అపరిమిత అధికారాలు ఇవ్వడం కూడా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని భావిస్తున్న చంద్రబాబు పోలీసులను గరిష్టంగా వాడుకుని, ప్రత్యర్థులను అదుపులో పెట్టాలని భావిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ స్వప్రయోజనాలకు పోలీసులను వాడుకుంటే దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనివల్ల చంద్రబాబుకు చెడ్డ పేరు మూటగట్టుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రవీణ్ పాస్టర్ కేసు, సోషల్ సైకోలను అదుపు చేయడం వంటి కొన్ని ఉదాహరణలను చూపుతున్న చంద్రబాబు పోలీసులకు అపరిమిత స్వేచ్ఛ ఇస్తే నిజాలను బయటపెట్టేవారు కూడా బలైపోతారని, స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా, అధికారులపై నిఘా కూడా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు.