ఈ ఏడాదైనా ఈ కూటమి నేతల తీరు మారుతుందా..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. అయితే కూటమి పార్టీల్లోని నాయకుల మధ్య సఖ్యత మాట ఎలా ఉన్నా కొంతమంది తీరు మాత్రం మారడం లేదనేది సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెబుతున్న మాట.
By: Tupaki Desk | 12 Jun 2025 3:00 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. అయితే కూటమి పార్టీల్లోని నాయకుల మధ్య సఖ్యత మాట ఎలా ఉన్నా కొంతమంది తీరు మాత్రం మారడం లేదనేది సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెబుతున్న మాట. ఇది కూటమి పార్టీలు అంటే ఇష్టం లేని వారు లేదా ప్రతిపక్షానికి మద్దతు పలకాలి అనుకునే వారు చెబుతున్న మాట కాదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పదేపదే చెబుతున్నారు. నాయకుల మధ్య సఖ్యత లేకపోతే సఖ్యత తీసుకురావడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
కానీ నాయకుల తీరే బాగోలేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఒకరిద్దరు నాయకులు మహిళల విషయంలో చిక్కుల్లో చిక్కుకోవడం, మరికొందరు ఇసుక, మట్టి, మద్యం వంటి వాటిలో ఇరుక్కోవడం కామన్‌గా ఈ ఏడాది కాలంలో కనిపించాయి. అయితే వీరందరికీ భిన్నంగా మరికొందరు నాయకులు వ్యవహరించారు. వైసిపి నాయకులతో చేతులు కలిపి కార్యక్రమాలు జరుపుతున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీనిలో అటు జనసేన ఇటు టిడిపి అటు బిజెపి మూడు పార్టీల నాయకులు ఉన్నారన్నది రాజకీయ వర్గాల్లోనే కాదు ఆయా పార్టీల అధినాయకుల మధ్య కూడా చర్చగా మారింది.
ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన చంద్రబాబు ఎవరి పరిధిలో వారు ఉండాలని హెచ్చరించారు. గతంలో కూడా వైసిపి నాయకులకు మేలు చేస్తున్నారు అంటూ బహిరంగంగానే చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతాన్ని మర్చిపోయారా అంటూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో జరుగుతున్నటువంటి పరిణామాలను, రొయ్యల చెరువులు, చేపల చెరువుల విషయాల్లో చేతులు కలుపుతున్న వైనాన్ని అంతర్గత చర్చల్లో లేవనెత్తుతూనే ఉన్నారు.
దీనికి సదరు నాయకులు ఎలాంటి సమాధానం చెప్పినా రేపు భవిష్యత్తులో ఆయా పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అన్నది నాయకుల అభిప్రాయం. ప్రజలు ఎప్పుడూ తాము ఎన్నుకున్న వారు ప్రత్యర్థులతో చేతులు కలపడాన్ని సహించరు. పైగా విభిన్నమైనటు వంటి రాజకీయ వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను ప్రజలు కోరుకోరు . కాబట్టి నాయకుల తీరు వచ్చే సంవత్సరం అయినా మారాలని ప్రజలకు చెరువ కావాలని ఆశిద్దాం. లేకపోతే.. ఇబ్బందులు ఇంటా బయటా కూడా తప్పకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
