చాన్నాళ్ళకు బాబు పవన్... రీ సౌండ్ మోత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఒక బహిరంగ వేదిక మీద కనిపించారు.
By: Satya P | 29 Sept 2026 9:25 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఒక బహిరంగ వేదిక మీద కనిపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన పల్లె పండుగ 3.0లో అటు బాబు ఇటు పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక మొత్తం కలియతిరిగారు. దాంతో జనాల్లో ఉత్సాహం రీసౌండ్ మోత మోగింది. పవన్ బాబు కలసి ఈ మధ్య ఎక్కడా సభలలో పాల్గొనలేదు. చివరి సారిగా ఉత్తరాంధ్రలోని భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలోనే ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోడీతో కలసి ఇద్దరూ వేదిక మీద కనిపించారు. అంటే సరిగ్గా రెండు నెలల కాలం అన్న మాట. ఆ తరువాత పవన్ ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్ళడం జరిగింది. దాంతో ఈ ఇద్దరినీ చాన్నాళ్ళకు ఒక సభలో కలిసి చూడడంతో ప్రజల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి.
హుషారుగా అగ్ర నేతలు :
ఉదయగిరి సభలో చంద్రబాబు పవన్ ఇద్దరూ హుషార్ గా సందడి చేస్తూ కనిపించారు. ఇక వేదిక మీద బాబు పవన్ పక్క పక్క సీట్లలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. చంద్రబాబు పవన్ గురించి సభలో మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిధిలోని పంచాయతీ రాజ్ శాఖలో తనదైన ముద్ర చూపిస్తున్నారని గ్రామాల్లో పనుల ద్వారా తన హవాను చాటుకుంటున్నారని చంద్రబాబు ప్రశంసించారు. పల్లె పండుగ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తున్నారంటూ పవన్‌ను ప్రత్యేకంగా బాబు అభినందించారు. తన అనుభవం ప్లస్ పవన్ హుషారు కూటమి ప్రభుత్వంగా చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం తామిద్దరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని బాబు తెలిపారు.
బాబు అవసరం అంటూ :
అదే సమయంలో ఉదయగిరి సభలో చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రశంసించారు. చంద్రబాబు నాయుడి అనుభవాన్ని విజన్‌ను పవన్ కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు ఈ సభలో ప్రశంసలు కురిపించుకోవడం ఆసక్తిని రేపింది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇద్దరు నేతలు ఎంతో సమన్వయంతో రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేస్తున్న తీరుకు ఉదయగిరి సభా వేదిక అద్దం పట్టింది. అంతే కాదు కూటమిలో ఏమైనా తేడాలు ఉన్నాయని ఎవరైనా అపోహలు పెట్టుకుంటే వాటికి చెక్ చెప్పేలా ఈ సభ సాగింది అని అంటున్నారు. పవన్ ఈ మధ్యన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనే బహిరంగ సభలలో పాల్గొనడం లేదు తప్పించి కూటమి అంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఈ సభ మరోసారి చాటింది అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో తొందరలో జరుగుతున్న వేళ కూటమి ఐక్యతను గట్టిగా చాటేలా ఈ ఇద్దరి అగ్ర నేతల తీరు ఉందని అంటున్నారు. అలా రెండు పార్టీ క్యాడర్ కి ఒక సంకేతాన్ని పంపించారు అని అంటున్నారు.
