చంద్రబాబు, పవన్ బాధ ఒక్కటే.. సోషల్ మీడియాతో ఎలా వేగేది దేవుడా?
అమరావతి మునిగిపోయిందని, విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ శిథిలావస్థకు చేరిందని ప్రచారం చేయడంతోపాటు రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేశారు.
By: Tupaki Desk | 15 Sept 2025 1:00 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే సమస్యతో సతమతమవుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అపరిమిత అధికారంతో పవర్ సెంటర్ గా ఉన్న ఆ ఇద్దరికీ సోషల్ మీడియాను డీల్ చేయడం పెద్ద సవాల్ గా మారిందంటున్నారు. అధికారంలోకి వచ్చిన నుంచి సోషల్ మీడియా విసురుతున్న అనేక చాలెంజ్ లను ఎదుర్కోవడమే ఇద్దరు ప్రధాన నేతలకు బిగ్ టాస్క్ గా మారిందని చెబుతున్నారు. దీంతో ప్రత్యేక చట్టం చేయాలని ఆలోచించడంతోపాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో 164 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షమే లేకుండా ప్రభుత్వాన్ని స్థాపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను సోషల్ మీడియా భయపెడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. తాము ఎంత జాగ్రత్తగా పనిచేస్తూ, వివాదాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో ఏదో రకంగా రచ్చ చేసి ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్ర పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అడ్డుగోలు ప్రచారం వల్ల ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ సమస్యను అధిగమించడం ఎలా అంటూ మదనపడుతున్నట్లు చెబుతున్నారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసు కేసులు పెట్టేవారు. సోషల్ సైకోలను అదుపు చేసేందుకు అరెస్టులు చేస్తున్నట్లు చెప్పేవారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు సోషల్ మీడియా కేసుల్లో ఇప్పుడు అరెస్టులకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో వ్యక్తిగత దూషణలను వదిలిపెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలు.. ప్రభుత్వంపై మరో విధమైన యుద్ధానికి తెరతీశారని అంటున్నారు. లేనిది ఉన్నట్లు చూపుతూ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా కొన్ని పోస్టులు చేస్తూ అధికార పార్టీ కార్యకర్తలను తప్పుదారి పట్టించడం, తమ ట్రాప్ లో ఇరుక్కునేలా చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.
అమరావతి మునిగిపోయిందని, విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ శిథిలావస్థకు చేరిందని ప్రచారం చేయడంతోపాటు రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేశారు. ఎక్కడో వాగు పొంగితే అది అమరావతి అంటూ చేసిన ప్రచారం ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసిందని అంటున్నారు. అదేవిధంగా మచిలీపట్నంలో ఓ వ్యక్తి డిప్యూటీ సీఎంపై వ్యక్తిగత దూషణలకు దిగితే.. జనసేన సైనికులు అతడి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. దీనిపై వీడియోలు వైరల్ చేసి ప్రభుత్వాన్ని జనసేన పార్టీని ఇరకాటంలో పెట్టారు. అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన ప్రభుత్వ వర్గాలు సోషల్ మీడియాను ఉపయోగించి కార్యకర్తలను ట్రాప్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలను ముందుగా రెచ్చగొట్టడం.. ఆ తర్వాత వారు రెచ్చిపోతే సోషల్ మీడియాలో అల్లరి చేయడం అన్న కాన్సెప్ట్ తో పనిచేస్తున్నట్లు జనసేన, టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ప్రత్యర్థుల ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలను హెచ్చరిస్తున్నాయి.
