Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో పవన్ కీలక భేటి.. సంచలన నిర్ణయం?

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది.

By:  Tupaki Political Desk   |   4 Feb 2026 4:49 PM IST
చంద్రబాబుతో పవన్ కీలక భేటి.. సంచలన నిర్ణయం?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిణామాలతోపాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం కలుసుకున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణ కమిషన్ వేయాలని ఆ సమావేశంలో తీర్మానించుకున్నారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ముఖ్య నేతలు మరోసారి కలుసుకోవడం, సుమారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది.

నిజానికి ముఖ్యమంత్రి షెడ్యూల్ లో ఈ రోజు పవన్ తో సమావేశాన్ని ముందుగా ప్రకటించలేదు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ లో ఉదయం 12.15 నిమిషాలకు సచివాలయానికి వెళ్లాల్సివుంది. 12.30 నిమిషాలకు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష జరగాల్సివుంది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ తో సమావేశం కారణంగా సీఎం షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుందని చెబుతున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం సుమారు రెండున్నర గంటల పాటు సీఎంతో చర్చించారు.

సీఎం, డిప్యూటీ సీఎం భేటీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీటీడీ లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి సరఫరాపై అధికార, విపక్షాల మధ్య వాదనలు సాగుతున్నాయి. లడ్డూ ప్రసాదంలో కల్తీపై సుప్రీంకోర్టు సూచనలతో సీబీఐ సిట్ విచారణ పూర్తి చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరిపించాలని విచారణ కమిషన్ వేయాలని నిర్ణయించింది. మంగళవారం కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా, విచారణ కమిషన్ లో ఎవరు ఉంటారు? కమిషన్ తోపాటు సభ్యులుగా ఎవరినైనా నియమిస్తారా? కమిషన్ కు కాలపరిమితి ఎంత ఇస్తారు? అన్న విషయాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఈ అంశంపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణీత గడువు ప్రకారం విచారణ పూర్తి చేయించి నివేదిక తెప్పించుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్య నేతలు ఇద్దరు నిర్ణయించినట్లు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా లడ్డూ వ్యవహారంలో రాజకీయ దాడిని మరింత ఉధృతం చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం ట్రాప్ లో పడకుండా అధికార పార్టీ నేతలు సంయమనంతో నడుచుకోవాలని కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

ఇక ఈ నెల 11న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, త్వరలో జరగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికపైనా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. అదేవిధంగా పెండింగులో ఉన్న నామినేటెడ్ పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కోరినట్లు చెబుతున్నారు. మరోవైపు పదవుల భర్తీలో జనసేన కేడర్ కు అన్యాయం జరుగుతోందన్న విషయంపైనా చర్చ జరిగిందని, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని పవన్ సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు చెబుతున్నారు.