కూటమి కఠిన నిర్ణయాలు.. పవన్ ప్రభావమేనా?
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 7 July 2026 2:51 PM ISTఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనుచిత ప్రవర్తనను అదుపు చేయాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని వాడుకోవడం సంచలనంగా మారింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోలేదని, ఇప్పుడు సాధారణ కేసులలో కూడా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇలా మారడానికి కారణాలు ఏమైవుంటాయని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, అందుకే సీఎం కూడా తన ప్రసంగాల్లో పవన్ పై జరుగుతున్న దాడిని ప్రస్తావిస్తూ తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తున్నారని అంటున్నారు.
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్చర్యకరంగా పవన్ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అన్నదే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచించే చంద్రబాబు, తన 4.0 సర్కారులో మాత్రం కొన్ని అంశాల్లో జోరు చూపిస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియా కేసుల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయని చెబుతున్నారు.
రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబుకు తొలి రెండు విడతలు సాఫీగా సాగిపోయాయి. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం లేకపోవడంతో చంద్రబాబు రాజకీయాలు ఒక మోస్తరుగా సాగిపోయేవి అని చెబుతున్నారు. అయితే 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక సోషల్ మీడియా నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు అవేవీ తనను ఇబ్బంది పెట్టే సమస్యగా భావించలేదని అంటున్నారు. దీంతో అప్పట్లో అంటే 2014-19 మధ్య చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో పనిచేసిన వారిపై సోషల్ మీడియాలో ఎంతలా దాడి చేసినా పెద్దగా పట్టించుకోలేదని, పోలీసు కేసులు కూడా పెద్దగా పెట్టలేదని అంటున్నారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు.
2024 జూన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు సోషల్ మీడియా పోస్టులపై ఉదాసీనంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ స్ట్రాంగ్ రియాక్షన్ తో కేసుల నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. తనతోపాటు కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత వరుసపెట్టి కేసులు నమోదు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురిని అరెస్టు చేయడం గమనిస్తే ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి ఎక్కువగానే ఉందన్న విషయం అర్థమవుతోందని అంటున్నారు. ప్రస్తుతం యూట్యూబర్ రావణ్ అరెస్టు ముందు కూడా ‘తాను హోంమంత్రి అయితే’ అంటూ పవన్ సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆ తర్వాత రావణ్ అరెస్టు జరగడం, వరుసగా బెయిలు వస్తున్న దశలో ఉపా చట్టం ప్రయోగించడం చూస్తే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందనే విషయం అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తన మిత్రుడిని కాపాడుకోవడం కోసం సీఎం చంద్రబాబు ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. నాన్చుడు ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తారని, ప్రతివిషయాన్ని భూతద్దంలో చూస్తారని టీడీపీ కార్యకర్తలు సైతం విమర్శిస్తుంటారని చెబుతారు. కానీ, పవన్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పడమే కాకుండా, ఆఘమేఘాలపై నిర్ణయాలు తీసుకోవడం, యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం చూస్తే ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోందని అంటున్నారు. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి చేస్తాయా? లేదా? అన్న విషయమై సీఎం ఆలోచన చేస్తున్నారో? లేదో? కూడా తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
