వరుసగా రెండో రోజు.. చంద్రబాబు, పవన్ భేటీ.. కూటమిలో ఏం జరుగుతోంది?
స్థానిక ఎన్నికల సందర్భంగా ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. పలుచోట్ల సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో అగ్రనేతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2026 1:40 PM ISTస్థానిక ఎన్నికల సందర్భంగా ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. పలుచోట్ల సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో అగ్రనేతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుసగా రెండు రోజులు సమావేశం కావాల్సివచ్చిందని అంటున్నారు. గురువారం ముఖ్యమంత్రితో సుమారు గంట పాటు చర్చించిన పవన్ శుక్రవారం కూడా సీఎంను కలిశారు. జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధంచి నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో అగ్రనేతల కలయికకు ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పలుజిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై ఏకాభిప్రాయం కుదరలేదని, వీటిపై చర్చించేందుకు అగ్రనేతలు ఇద్దరు సమావేశమయ్యారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటును జిల్లా నేతలకు అప్పగించడంతో పలుచోట్ల పీటముడి పడిందని అంటున్నారు. మూడు పార్టీల నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తుండటంతో ప్రతిష్టంభన నెలకుందని చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై ముందుకు ఎలా వెళ్లాలనే అంశంపై చర్చించారని అంటున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటును జిల్లా, నియోజకవర్గ నేతలకు అప్పగించారని అంటున్నారు. సాధ్యమైనంత వరకు జిల్లాస్థాయిలోనే ఈ చర్చలు కొలిక్కి తీసుకురావాలని టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయించాయి. అయితే కొన్నిచోట్ల ఆశావహులు ఎక్కువగా ఉండటం, మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు నామినేషన్లు వేయడంతో వారికి సర్దిచెప్పడం జిల్లా నాయకత్వాలకు తలకుమించిన భారంగా మారిందని అంటున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జడ్పీ చైర్మన్ స్థానాలపైనా ఇంతవరకు చర్చలు జరగకపోవడంతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో ఆ అంశంపైనా చర్చ జరిగిందని చెబుతున్నారు.
8 జడ్పీ చైర్మన్ పదవులు..
జడ్పీ ఎన్నికల్లో జనసేనకు కేటాయించే స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ సందర్భంగా ఈ విషయమై చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 28 జడ్పీలు ఉండగా, తమకు 8 జిల్లా పరిషత్ చైర్మన్, 8 జిల్లాలలో డిప్యూటీ చైర్మన్ పదవులు కావాలని జనసేన ప్రతిపాదనలు పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని టీడీపీ సూచించినట్లుగా చెబుతున్నారు. గెలిచే స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ అంశమై చర్చిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. మొత్తానికి జనసేన ప్రతిపాదనలపై హాట్ డిబేట్ జరుగుతోంది. పదవుల్లో మూడో వంతు తమకు ఇవ్వాలనే ప్రాతిపదికతో జనసేన ముందస్తుగా పావులు కదుపుతోందని అంటున్నారు.
