ఏడాది పాలన: బాబు మార్కు విజన్ గవర్నెన్స్ ..!
దీంతో చంద్రబాబులో ఉన్న 'విజన్' నాయకుడిపై సర్వత్రా సందేహాలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఈవిషయంలో తనను తాను మలుచుకున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 2:45 AMరాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు తన విజన్‌ను మరోసారి నిలబెట్టుకున్నారు. గతంలో తనకు ఉన్న ఇమేజ్.. తర్వాత కాలంలో నిలబెట్టుకున్నారు. అయితే.. 2024 ఎన్నికల సమయానికి ప్రజలు సంక్షేమకార్యక్రమాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలతో ప్రజలు దాదాపు వాటిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా వాటినే తనకు నిచ్చెనగా మార్చుకోవాల్సి వచ్చింది.
దీంతో చంద్రబాబులో ఉన్న 'విజన్' నాయకుడిపై సర్వత్రా సందేహాలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఈవిషయంలో తనను తాను మలుచుకున్నారు. సంక్షేమం-అభివృద్ధి పాలనకు విజన్‌ను జోడించారు. దీంతో ఏడాది పాలనలో విజన్‌కు కూడా సమతూకమైన స్థానం.. వేదిక దక్కింది. ముఖ్యంగా మూడు అంశాల్లో చంద్రబాబు దూకుడుగా విజన్‌ను తిరిగి ప్రారంభించారనే చెప్పాలి. 1) వాట్సాప్ గవర్నెన్స్.. దీని ద్వారా 300 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు కార్యాలయాలకు రాకుండా..త మ చేతిలోని ఫోన్‌లోనే ఈ సేవలను పొందేలా వీలు కల్పించారు. ప్రస్తుతం ఇది గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కొంత చేరువ కాకపోయినా.. ఇతర ప్రాంతాల్లో అమలవుతోంది.
2) ఐటీకి పెద్దపీట.. ఈ విధానంలో విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా మార్చేందుకు టాటా సన్స్ సహా.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం.. బిల్ గేట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలోనూ బిల్ గేట్స్ సంస్థను తీసుకువచ్చేలా చూస్తున్నారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా ఐటీ నిపుణులను రాష్ట్రంలోనే తయారు చేసేలా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఇక్కడ ఉపాధి లభించేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే..ఏఐ కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని స్థాపించేలా చర్యలు తీసుకుంటున్నారు.
3) క్వాంటం కంప్యూటింగ్... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా క్వాంటం కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినిఏపీలోనే అది కూడా అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వస్తే.. ప్రపంచదేశాలు సైతం అమరావతివైపు చూడడం ఖాయమని విశ్వసిస్తున్నారు. అదేవిధంగా 10 వ తరగతి నుంచే ఏఐ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని కూడా పాఠ్యాంశంగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. ఏఐ ద్వారా పాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా.. చంద్రబాబు ఈ ఏడాది కాలంలో తన విజన్‌ను పాలనకు జోడించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.