స్వర్ణాంధ్ర విజన్ -2047నే లక్ష్యం
ఈ సందర్భంగా చంద్రబాబు.. గత ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు.
By: Tupaki Desk | 24 Jun 2025 8:15 AM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అభివృద్ధి పరుగులు పెడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు(కేంద్రం+రాష్ట్రం) కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి సాధించగలుగుతున్నామన్నారు. అంతేకాదు.. కూటమి సర్కారు ఎలా పనిచేస్తుందో కూడా ఈ ఏడాది కాలంలో ప్రజలకు తెలిసేలా చేశామన్నారు. ఏడాది కూటమి పాలనపై నిర్వహించిన `సుపరి పాలనలో తొలిఅడుగు` కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత ఏడాది కాలంలో తీసుకువచ్చిన పెట్టుబడులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కార్యదర్శలు, జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.
అలాగే మంత్రులు, 164 మంది ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. గత ఏడాది పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు అంతా మంచి చేశామన్న ఆయన.. సూపర్ సిక్స్ ద్వారా ప్రజలు ఊహించని మేలును కూడా చేశామని వివరించారు. ``డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించాం`` అని వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు 2024 ఎన్నికలకు ముందు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు కూడా అంతే నిబద్ధతతో ఉన్నాయని.. అందరూ కలసి కట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కంకణం కట్టుకున్నారని తెలిపారు. కూటమి పార్టీల్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు.
సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసిరావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు అందించాలన్నారు. పథకాలను ఎలాంటి వివక్షలేకుండా అందించాలన్నారు. రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వస్తున్నాయన్న ఆయన.. ఏయే రంగంలో ఎంతెంత పెట్టుబడి వస్తోందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ``మేం ఒప్పందాలు చేసుకున్నాం.. మీరు వారి వెంటపడాలి. పెట్టుబడులు తీసుకురావాలి. ఈ విషయంలో మీరే బాధ్యత వహించాలి`` అని అధికారులకు సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
ముఖ్యంగా పీ-4 పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. గతంలో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత మంది పేదలు ఉన్నారో.. ఇప్పుడు డబుల్ అయ్యారని.. పేదలు పేదలుగానే ఉంటున్నారని.. ధనిక వర్గాలు.. మరింత అభివృద్ది చెందుతున్నాయని.. దీనిని తగ్గించేందుకే పీ4 తీసుకువచ్చామన్నారు. దీనిపై చాలా మంది ప్రశ్నిస్తున్నారని .. వీటికి త్వరలోనే సమాధానాలు చెబుతామని వ్యాఖ్యానించారు. ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. అభివృద్దికి చిరునామాగా ఏపీని మలుస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర విజన్-2047 ఒక్కటే లక్ష్యమని తెలిపారు.
