Begin typing your search above and press return to search.

బాబు చుట్టూ కోటరీ ?

రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి. పార్టీలకు అధినేతలు ఉంటారు. అధినేతలకు కోటరీలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 May 2025 4:00 AM IST
బాబు చుట్టూ కోటరీ ?
X

రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి. పార్టీలకు అధినేతలు ఉంటారు. అధినేతలకు కోటరీలు ఉంటాయి. ఇది సహజమైన విషయం. ఇంగ్లీష్ లో చెబితే కోటరీ అంటే ఏదో భారీ పదంగా ఉంటుంది కానీ నిజానికి అది అచ్చ తెలుగులో చూస్తే సన్నిహితుల బృందం అని చెప్పాలి. ఒక సంస్థలో కానీ కంపెనీలో కానీ కీలక బాధ్యతలు చూసేవారికి సహాయకులుగా కొందరు ఉంటారు.

అన్నీ ఆ ముఖ్యుడు చూసుకోలేరు కాబట్టి మిగిలిన వారు కూడా తలోటి చూస్తూ సహకరిస్తారు. అయితే కంపెనీలు, సంస్థలు వేరు, రాజకీయం వేరు. ఇదంతా ప్రజలతో ముడిపడిన వ్యవహారం. దాంతో ఇక్కడ కోటరీలు కట్టినా కోటలు కట్టినా వాటిని దాటి నేతలు దూసుకుని వస్తారు. తమకు అన్యాయం జరిగినపుడు కోటరీ మీదనే తుపాకీ గురి పెడతారు.

ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాలలో చూస్తే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల విషయంలో కోటరీ ప్రచారం విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అవి తెగ వైరల్ అయ్యాయి కూడా. వైసీపీలో కీలక నేతగా ఉంటూ ఇక ఈ రాజకీయం చాలు అని అనుకున్న విజయసాయిరెడ్డి జగన్ మీద చేసిన తీవ్ర ఆరోపణలలో కోటరీ అన్నది అతి ముఖ్యమైనది. కోటరీ చేతిలో జగన్ బంధీ అయ్యారు అని విజయసాయిరెడ్డి సీరియస్ గానే ఆరోపణలు చేశారు. చిత్రమేంటి అంటే ఒకనాడు అదే విజయసాయిరెడ్డి కోటరీలో కీలకంగా ఉండేవారు అని అంటారు.

ఇక కట్ చేస్తే తెలంగాణాలో మరో మాజీ సీఎం కేసీఆర్ విషయంలో కోటరీ చుట్టూ ఉంది అని ఎవరో ఆరోపణలు చేయడం లేదు, ఆయన సొంత కుమార్తె కవిత ఆరోపించారు. దాంతోనే ఈ ఆరోపణలకు ఎక్కడ లేని బలం వచ్చింది. పైగా జనంలో పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం ఏర్పడింది.

మరో వైపు చూస్తే గతంలో సీఎం లుగా పని చెసిన వారి విషయంలో కోటరీ ఉందని విమర్శలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా అర్ధ శతాబ్దం చరిత్ర ఉన్న చంద్రబాబుకు కూడా కోటరీ ఉందా అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్త్తోంది. టీడీపీకి అన్న గారు సీఎం గా ఉన్నపుడు ఆయన చుట్టూ కోటరీ ఉండేదని అందులో ఇద్దరు అల్లుళ్ళు ప్రధానంగా ఉండేవారు అని చెప్పుకునేవారు. ఈ కోటరీ వల్ల లాభం సంగతి ఏమో కానీ నష్టమే ఎన్టీఆర్ కి జరిగింది అని కూడా తర్వాత కాలంలో రాజకీయ విశ్లేషకులు అన్న మాట.

ఈ నేపధ్యంలో 1995లో అన్న గారి నుంచి అధికార పగ్గాలు పార్టీ పగ్గాలు తీసుకున్న చంద్రబాబు గత మూడు దశాబ్దాలుగా పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే బాబు చుట్టూ కూడా కోటరీ ఉందా అంటే లేదు అనే చెప్పాలని అంటున్నారు. ఇంతటి సీనియర్ మోస్ట్ లీడర్ అయిన బాబు ఒక కోటరీ ఏర్పాటు చేసుకోలేదా అంటే లేదనే అంటారు రాజకీయంగా ఇది చాలా ఆసక్తిని పెంచే విషయంగానే చూడాలి.

చంద్రబాబుకు అందరూ సన్నిహితులే అన్నట్లుగా ఉంటారు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పొలిట్ బ్యూరోని పిలుస్తారు. పార్టీ ముఖ్యులతో చర్చిస్తారు. అందరి సలహాలు తీసుకున్న తరువాత తనదైన ఆలోచనలను అందులో కలిపి మరీ కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక చంద్రబాబు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునే నాయకుడు. పైగా నిత్యం జనంతో మమేకం అయ్యే వారు కూడా.

అందుకే ఆయన కోటరీ మీద ఎపుడూ ఆధారపడిన సందర్భాలు లేవని అంటారు. అందుకే ఇన్నేళ్ళ బాబు రాజకీయ జీవితంలో కోటరీ అన్న మాటే వినిపించలేదు. తాన రాజు తానే మంత్రి అన్నట్లుగా బాబు వైఖరి ఉంటుందని ఆయనకు అన్నీ తెలుసు అని ప్రత్యేకించి ఆయన కోటరీ పేరుతో కొందరి సలహాలూ సూచనలకే పరిమితం అయిన సందర్భాలు అయితే ఇన్నేళ్ళ పాలిటిక్స్ లో లేనే లేవని అంటారు.

నిజంగా బాబులో ఉన్న రాజకీయ ప్రత్యేకత ఇదే అని అంటారు. ఈ రోజున దేశంలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీ అధినేతకు కోటరీ ఉంది. కానీ ఈ కోటరీ కోటలో బంధీ కానిది మాత్రం బాబు ఒక్కరే అని అంటున్నారు. అందుకే ఆయన మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఆ ఒక్క విషయంలో మాత్రం ఏమీ అనలేని పరిస్థితి ఉంది అని అంటారు.