ఆ నేతలను లోకేష్‌కు అప్పగిస్తారా.. బాబు ఫైనల్ డెసిషన్.. !
పోనీ.. వీరిపై కఠినంగా వ్యవహరిద్దా మంటే.. చంద్రబాబు మనసు ఒప్పుకోవడం లేదు. ఇది నేతలకు అందివచ్చిన వరంగా మారుతోంది.
By: Garuda Media | 29 July 2026 8:00 PM ISTపార్టీలో ఉంటూ.. ప్రజలను కలుసుకోని.. వివాదాలకు కేంద్రంగా మారుతున్న నాయకులను ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు బుజ్జగిస్తూ.. వచ్చారు. వారికి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అయితే.. దీనిని కొందరు నేతలు.. లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా చంద్రబాబు ప్రయత్నాలు.. పెద్దగా ఫలించడం లేదు. నాయకులు ఒక చెవితో విని.. మరో చెవితో వదిలేస్తున్నారు. పోనీ.. వీరిపై కఠినంగా వ్యవహరిద్దా మంటే.. చంద్రబాబు మనసు ఒప్పుకోవడం లేదు. ఇది నేతలకు అందివచ్చిన వరంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో దారి తప్పుతున్న నాయకుల వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారు తోంది. ఈ విషయంలో అంతో ఇంతో కఠినంగా వ్యవహరించకపోతే.. నాయకులు గాడిలో పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇక నుంచి వివరణలు.. విచారణలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే.. వారిని గట్టిగా హెచ్చరించడమే ముఖ్యమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇకపై ఆరోపణలు వచ్చిన వారిని నేరుగా లోకేష్‌కు లింకు చేయాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.
లోకేష్ అయితే.. ఎలాంటి మొహమాటాలు లేకుండా.. ఎలాంటి బుజ్జగింపులు లేకుండా నాయకులకు ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెబుతారు. పార్టీలో ఉండాలని అనుకునే వారు ఉంటారు.. లేక పోతే.. కొత్త నాయకులను తయారు చేసుకుంటామని గతంలోనూ ఒకరిద్దరు నాయకులకు తేల్చి చెప్పారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్నసమయంలో తలెత్తిన రెండు వివాదాలను నారా లోకేష్ తన పదునైన వ్యాఖ్యలతో సరిచేశారు. దీంతో నాయకులు లైన్‌లోకి వచ్చారు.
ఇక, నుంచి ఇదే పంథా అనుసరించాలని చంద్రబాబు కు సీనియర్లు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచివచ్చిన వారితోనూ లోకేష్‌తో తరచుగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయప డుతున్నారు. తద్వారా పార్టీలో కాలర్ ఎగరేసే నాయకులను లైన్‌లో పెట్టుకోవచ్చని.. పూర్తిగా ప్రక్షాళన చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై చంద్రబాబు ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనిపై అందరి అభిప్రాయం తీసుకుని తర్వాత ఫైనల్ నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలిసింది.
