Begin typing your search above and press return to search.

ఇక నుంచి అధికారులూ ప్ర‌జ‌ల్లోకి.. బాబు వ్యూహ‌మేంటి.. ?

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే విష‌యంలో రాజ‌కీయంగా నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌న్న‌ది చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న మాట‌.

By:  Garuda Media   |   29 July 2026 7:00 PM IST
ఇక నుంచి అధికారులూ ప్ర‌జ‌ల్లోకి.. బాబు వ్యూహ‌మేంటి.. ?
X

ప్ర‌జ‌ల్లోకి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లాల‌ని చెబుతున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు రూట్ మార్చేశారు. ఇక నుంచి ఉన్న‌తాధికారులు సైతం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని తాజాగా ఆదేశించారు. ముఖ్యంగా ఐఏఎస్‌, ఐపీఎస్ స్థాయి సీనియ‌ర్ అధికారులు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. అయితే.. అది ఏ రూపంలో అనేది వారే నిర్ణ‌యించుకునే స్వేచ్ఛ‌ను ఇచ్చారు.

మీడియా ముందుకు వ‌చ్చినా.. లేక ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లినా.. త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. ఇది రాజ‌కీయ ప‌రంగా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండించాల‌ని మాత్ర‌మే ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం తీసుకునే విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను.. ఆధారాలు, వాస్త‌వాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే బాధ్య‌త‌ను ఉన్న‌తాధికారులు తీసుకోవాల‌ని సూచించారు.

ఎందుకు..?

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే విష‌యంలో రాజ‌కీయంగా నాయ‌కులు వెనుక‌బ‌డ్డార‌న్న‌ది చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. సీఎంగా తాను మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వాటిని చేరుస్తున్నాన‌ని చెబుతున్నారు. కానీ, ఇది స‌రిపోవ‌డం లేద‌ని దీంతో ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌రైన కౌంట‌ర్లు ప‌డడం లేద‌ని ఆయ‌న వాపోతున్నారు. ఈ క్ర‌మంలో స‌బ్జెక్టుల ప‌రంగా అవ‌గాహ‌న ఉన్న అధికారులు నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం కారాద‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.

వీటిలో

1) అమ‌రావ‌తి విస్త‌ర‌ణ‌: 29 గ్రామాల‌కు మాత్ర‌మే రాజ‌ధాని ప‌రిమితం కాద‌ని.. విజ‌య‌వాడ‌, గుంటూరు, మ‌చిలీప‌ట్నంతో కూడిన ప్రాంతాలు కూడా సీఆర్ డీఏ ప‌రిధిలో ఉంటాయ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

2) పీపీపీ విధానం: ఈ విధానంలో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి ఉంది. ఈ విధానంతో మెడిక‌ల్ కాలేజీల‌ను నిర్మించ‌నున్నారు.

3) పీ-4: దీని ద్వారా దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. పేద‌రిక నిర్మూలన చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఆయా విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే బాధ్య‌త‌ను పార్టీ నాయ‌కుల‌కు అప్ప‌గించారు. కానీ, వారు స‌క్సెస్ కాలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌పై ఉన్న‌తాధికారులు త‌ర‌చుగా మీడియా స‌మావేశాలు పెట్టాల‌ని.. అవ‌స‌రం అయితే.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లివివ‌రించాల‌ని సూచించారు. ఫ‌లితంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు దీటుగా.. స్పందించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే.. దీనిలో త‌లెత్తే రాజ‌కీయ అంశాల జోలికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.